ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లో ఊపేస్తోంది.
అయితే, ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో సమానంగా ఒక సీనియర్ నటుడి పాత్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనే రాకేష్ బేడీ. సాధారణంగా కామెడీ పాత్రలతో మెప్పించే రాకేష్ బేడీ, ఇందులో జమీల్ జమాలి అనే కుటిల రాజకీయనాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.
సచిన్ ఫిదా
ధురంధర్ 2 చిత్రంలో రాకేష్ బేడీ నటనకు ఫిదా అయిన వారిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. ఇటీవల 'ది లల్లంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత సచిన్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారని ఆయన తెలిపారు.
"రాకేష్ జీ, అద్భుతంగా నటించారు.. మీరు సినిమాలో కొట్టిన సిక్స్ మామూలుగా లేదు!" అని సచిన్ తనను మెచ్చుకున్నట్లు రాకేష్ తెలిపారు.
పాకిస్థాన్ లో
దానికి రాకేష్ బేడీ అంతే చమత్కారంగా సమాధానమిస్తూ.. "మీరు క్రికెట్ గ్రౌండ్‌లో చాలా సిక్సర్లు కొట్టారు, కానీ మీ సిక్సర్లు ఇండియాలో పడ్డాయి. నా సిక్స్ మాత్రం ఏకంగా పాకిస్థాన్‌లో పడింది" అని తాను అనడంతో సచిన్ నవ్వేశారని రాకేష్ బేడీ గుర్తు చేసుకున్నారు.
కథలో అసలు ట్విస్ట్ ఇదే!
రాకేష్ బేడీ తన పాత్ర గురించి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణం సినిమాలో ఆయన పాత్ర ఇచ్చే షాకింగ్ ట్విస్ట్. మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లోని లియారీలో ఉంటూ, అక్కడి రాజకీయాలను శాసించే కీలక నేతగా ఎదిగిన జమీల్ జమాలి.. చివర్లో తానూ ఒక భారతీయ గూఢచారిని అని రివీల్ చేస్తారు.
ఆ డైలాగ్ లు
రణ్‌వీర్ సింగ్ (హమ్జా)కు మామగా ఉంటూనే, దేశం కోసం రహస్యంగా పనిచేసే ఈ పాత్రలో రాకేష్ పలికించిన హావభావాలు, 'బచ్చా హై తూ మేరా' వంటి డైలాగులు ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని కలిగిస్తున్నాయి.
1500 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2
గతంలో వచ్చిన మొదటి భాగం 'ధురంధర్' స్లీపర్ హిట్‌గా నిలవగా, ఈ సీక్వెల్ ధురంధర్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. దేశీయంగా రూ. 1000 కోట్ల నెట్ వసూళ్లను దాటడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల మార్కును అధిగమించింది.
రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Chandu Shanigarapu

