Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిశ సాలియాన్ కేసులో సీబీఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశం

దిశ సాలియాన్ కేసులో సీబీఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశం

బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్ మృతి కేసులో బొంబాయి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో జరిగిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది.

అయితే దర్యాప్తు అధికారికి తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా భావించకూడదని జస్టిస్ సారంగ్ వి కోత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా భోంస్లేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

అసలు ఏం జరిగింది?

2020 జూన్‌లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి 28 ఏళ్ల దిశ సాలియాన్ మరణించారు. ఆ సమయంలో ఆమె తనకు కాబోయే భర్తతో పాటు స్నేహితులతో కలిసి విందు చేసుకుంటున్నారు. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ ఘటన జరిగిన ఆరు రోజులకే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం, గతంలో దిశ ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించడంతో ఈ రెండు మరణాల మధ్య లింక్ ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు ఎలాంటి కుట్ర లేదని, పార్టీ సమయంలో మనస్తాపం చెంది దిశ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ 2021 ఫిబ్రవరిలో మేజిస్ట్రేట్ కోర్టులో ముగింపు నివేదిక సమర్పించారు.

తండ్రి పోరాటం.. ఫోరెన్సిక్ ఆధారాలపై వాదనలు

పోలీసుల నివేదికను సవాలు చేస్తూ దిశ సాలియాన్ తండ్రి సతీష్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగాయని, ప్రభావవంతమైన వ్యక్తులను కాపాడేందుకే పోలీసులు ఆధారాలను తొక్కిపెట్టారని ఆరోపించారు.

సతీష్ సాలియాన్ తరఫు న్యాయవాది నీలేష్ ఓజా కోర్టులో కీలక వాదనలు వినిపించారు. భవనం పైనుంచి కిందపడిన ప్రదేశానికి, మృతదేహం లభించిన స్థలానికి మధ్య 10 అడుగుల దూరం ఉందన్నారు. పైన నుంచి కిందకు పడితే మృతదేహం నిలువుగా పడాలి తప్ప 10 అడుగుల దూరంలో పడే అవకాశం లేదని, ఇది ఆత్మహత్య కాదనడానికి స్పష్టమైన నిదర్శనమని ఫొరెన్సిక్ విశ్లేషణను ఉటంకించారు. ఐదేళ్ల పాటు తమకు దర్యాప్తు నివేదిక కూడా ఇవ్వకుండా కేసును ముగించారని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ సంచలనం.. సీబీఐ విచారణకు ఆదేశం

ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించింది. బీజేపీ నేత నారాయణ్ రాణే, ఆయన కుమారుడు నితీష్ రాణేలు ఈ ఘటనలో శివసేన (యుబిటి) నేత ఆదిత్య థాకరే హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరిపించింది.

అయితే ఈ కేసులో ఎలాంటి కుట్ర లేకపోతే ముంబై పోలీసులు ఇన్నేళ్లపాటు విచారణను ఎందుకు కొనసాగించారని హైకోర్టు ప్రశ్నించింది. కుమార్తెను కోల్పోయిన తండ్రి ఆవేదనను కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని భావించిన కోర్టు, కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu