ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) గడువులోగా దాఖలు చేస్తే బాధ్యత తీరిపోయిందని అనుకుంటే పొరపాటే. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. నగదు లావాదేవీలు, అధిక విలువైన ఆర్థిక లావాదేవీలపై కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయి.
ఈ నిబంధనలను దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు, భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నల్లధనం, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కఠినమైన నియమాలను అమలు చేస్తోంది. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఇల్లు కొంటున్నా లేదా ఎవరికైనా నగదు రూపంలో డబ్బులు ఇస్తున్నా ఈ కింద పేర్కొన్న ఏడు పరిమితులను గుర్తుంచుకోవడం ఎంతో అవసరం.
1. నగదు స్వీకరణపై పరిమితి (సెక్షన్ 269ST)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం.. ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో, ఒకే లావాదేవీకి లేదా ఒకే సందర్భానికి సంబంధించి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, మీరు ఎంతైతే నగదు తీసుకున్నారో.. అంతే మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
2. నగదు రుణాలు, డిపాజిట్లపై ఆంక్షలు (సెక్షన్ 269SS, 269T)
రుణాలు తీసుకోవడం లేదా తిరిగి చెల్లించే విషయంలో సెక్షన్ 269SS, 269T వర్తిస్తాయి. దీని ప్రకారం రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో అప్పుగా తీసుకోకూడదు, అలాగే డిపాజిట్ చేయకూడదు. తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇలాంటి లావాదేవీలన్నీ కేవలం బ్యాంకింగ్ ఛానెల్స్ (నెట్ బ్యాంకింగ్, చెక్, యూపీఐ) ద్వారానే జరపాలి.
3. వ్యాపార ఖర్చుల పరిమితి (సెక్షన్ 40A(3))
వ్యాపారులు తమ రోజువారీ ఖర్చుల కోసం ఒకే వ్యక్తికి ఒకే రోజులో రూ. 10,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. ఒకవేళ ఆ పరిమితి దాటి నగదు రూపంలో చెల్లిస్తే, సదరు ఖర్చును వ్యాపార వ్యయంగా చూపించి పన్ను మినహాయింపు (Tax Deduction) పొందేందుకు ఐటీ శాఖ అంగీకరించదు.
4. విరాళాలపై పన్ను మినహాయింపులు (సెక్షన్ 80G)
సామాజిక సేవా సంస్థలకు లేదా ట్రస్టులకు ఇచ్చే విరాళాల విషయంలో రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో ఇస్తే సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపు లభించదు. పన్ను లాభం పొందాలనుకునే వారు విరాళాలను కేవలం బ్యాంక్ లేదా డిజిటల్ పేమెంట్ విధానాల ద్వారానే బదిలీ చేయాలి.
5. ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు
రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థలాలు, ఇళ్ల కొనుగోలు లేదా అమ్మకాల వివరాలు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు చేరతాయి. దీనితో పాటు, ఆస్తి విలువ ఎంత ఉన్నప్పటికీ, భూ లావాదేవీల్లో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ లేదా నగదు రూపంలో చెల్లించడంపై సెక్షన్ 269SS కింద ఆంక్షలు ఉన్నాయి.
6. బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రాయల్స్ (సెక్షన్ 194N)
బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు విత్‌డ్రా చేసేవారిపై ఐటీ శాఖ నిఘా ఉంచుతుంది. సెక్షన్ 194N కింద ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేస్తే బ్యాంకులు టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి. గత కొన్ని ఏళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి ఈ పరిమితి ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ నిబంధన పెద్ద ఎత్తున జరిగే నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడానికి తెచ్చారు.
7. హై-వాల్యూ లావాదేవీలపై నిఘా (సెక్షన్ 285BA)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 285BA (రూల్ 114E) ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పన్ను చెల్లింపుదారులు చేసే కొన్ని పెద్ద మొత్తాల లావాదేవీలను 'స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్' (SFT) ద్వారా ఐటీ శాఖకు నివేదిస్తాయి. పన్ను ఎగవేతలను గుర్తించడానికి ఈ నివేదికలు సహాయపడతాయి. కాబట్టి, మీ ఐటీఆర్‌లో ఈ వివరాలన్నింటినీ స్పష్టంగా చూపించాలి. లేదంటే ఐటీ స్కృటినీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
Praveen Kumar Lenkala

