Dailyhunt
Ekta Kapoor: ఆ హీరో పనికి షాక్ అయ్యా, 31 ఏళ్ల నా కెరీర్‌లో ఎవరు అలా చేయలేదు.. లేడీ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ కామెంట్స్

Ekta Kapoor: ఆ హీరో పనికి షాక్ అయ్యా, 31 ఏళ్ల నా కెరీర్‌లో ఎవరు అలా చేయలేదు.. లేడీ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ కామెంట్స్

బాలీవుడ్ ప్రేక్షకులకు 'హేరా ఫేరి', 'భూల్ భులయ్యా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన అక్షయ్ కుమార్ - ప్రియదర్శన్ జోడీ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత 'భూత్ బంగ్లా'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సోమవారం (ఏప్రిల్ 6) భూత్ బంగ్లా సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పాపులర్ బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, అక్షయ్‌తో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన నిజాయితీని కొనియాడారు.

ఫ్లాప్ సినిమాకు తిరిగి డబ్బులిచ్చిన అక్షయ్!

ముప్పై ఏళ్లకు పైగా తన కెరీర్‌లో అక్షయ్ కుమార్ లాంటి నటుడిని చూడలేదని ఏక్తా కపూర్ ప్రశంసించారు. "చాలా ఏళ్లుగా అక్షయ్ సార్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. ఒక విషయం చాలా మందికి తెలియదు. మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి.. 'ఈ సినిమా వల్ల మీరు నష్టపోయారు, ఇదిగో మీ డబ్బులు' అంటూ రిటర్న్ చెక్ ఇచ్చారు" అని ఏక్తా కపూర్ వివరించారు.

అక్షయ్ కుమార్ చేసిన పనికి తాను షాక్‌కు గురయ్యానని ఏక్తా కపూర్ పేర్కొంటూ.. "నా 31 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి పని ఎవరూ చేయలేదు. ఆ డబ్బు తీసుకోవడానికి నేను నిరాకరించాను. దానికి బదులుగా నాతో ఇంకో సినిమా చేయండి, దాని ద్వారా నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను అని చెప్పాను. ఆ సినిమానే ఈ 'భూత్ బంగ్లా'" అని ఆమె ఎమోషనల్ అయ్యారు.

'భూత్ బంగ్లా' విశేషాలు

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన భూత్ బంగ్లా చిత్రాన్ని అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అక్షయ్‌తో పాటు పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటించారు.

ఒక వ్యక్తికి వారసత్వంగా ఓ బంగ్లా దక్కుతుంది. అయితే ఆ బంగ్లాతో పాటు వెనుక ఉన్న అడవిలో దెయ్యాలు ఉన్నాయని అతడికి తర్వాత తెలుస్తుంది. దీనికి తోడు 'వధుసుర్' అనే దుష్టశక్తి భయంతో ఎవరూ పెళ్లి చేసుకోని ఆ ఊరిలో ఇతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత జరిగే గందరగోళం, నవ్వులు పూయించే సంఘటనల సమాహారమే ఈ హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా'.

విడుదల తేదీ మార్పు

అయితే, భూత్ బంగ్లా సినిమాను ముందుగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందుగా ఏప్రిల్ 16 రాత్రి 9 గంటల నుంచే అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా పెయిడ్ ప్రివ్యూలు (Paid Previews) ప్రదర్శించనున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu