Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Electric scooter : మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- 243 కి.మీ రేంజ్​తో!

Electric scooter : మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- 243 కి.మీ రేంజ్​తో!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం వేగంగా పుంజుకుంటోంది. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలు ఈవీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'సింపుల్ ఎనర్జీ'.. కుటుంబ అవసరాలను లక్ష్యంగా చేసుకుని తమ నూతన ఈ-స్కూటర్ 'సింపుల్ వేవ్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ వన్ ఎస్, అల్ట్రా మోడళ్ల సరసన ఈ కొత్త స్కూటర్ చేరింది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి అవసరాలకు తగినట్లుగా దీనిని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ కొత్త ఎలక్టిరిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- డాల్ఫిన్ డిజైన్, 70 లీటర్ల భారీ స్టోరేజ్..

సముద్రంలో ఈదే డాల్ఫిన్ ఆకారం నుంచి ప్రేరణ పొంది ఈ సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను రూపొందించారు. దీనివల్ల స్కూటర్ అత్యంత ఆకర్షణీయంగా, నడపడానికి సులభంగా కనిపిస్తుంది. కుటుంబ వినియోగదారుల కోసం భారతదేశంలోనే అత్యధికంగా 70 లీటర్ల బూట్ స్పేస్ (స్టోరేజ్) సౌకర్యాన్ని ఇందులో కల్పించారు. ఏకంగా 920 ఎంఎం పొడవైన సీటు, 775 ఎంఎం ఎత్తైన సీటు, 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి కొలతలతో రైడర్‌కు, వెనుక కూర్చునే వారికి అనుకూలమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. సైడ్ ప్యానెల్స్‌పై అత్యవసర వస్తువులు దాచుకోవడానికి 'పిల్' స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లను కూడా చేర్చారు.

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- నాలుగు బ్యాటరీ ఆప్షన్లు, రేంజ్..

వాహనదారుల బడ్జెట్, రోజువారీ రేంజ్ అవసరాలకు అనుగుణంగా సింపుల్ వేవ్ నాలుగు రకాల బ్యాటరీ కెపాసిటీలలో లభిస్తుంది. 2.2 kWh, 2.7 kWh బ్యాటరీలు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్​ఎఫ్​పీ) సాంకేతికతతో రాగా, పెద్దవైన 3.7 kWh, 5 kWh బ్యాటరీలు నికెల్ కోబాల్ట్ అల్యూమినియం (ఎన్​సీఏ) సాంకేతికతతో నిర్మితమయ్యాయి.

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరును పరిశీలిస్తే..

  • 2.2 kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 110 కి.మీ రేంజ్ ఇస్తుంది.
  • 2.7 kWh బ్యాటరీ వేరియంట్ 132 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.
  • 3.7 kWh బ్యాటరీ మోడల్ 171 కి.మీ రేంజ్ ఇస్తుంది.
  • అత్యున్నతమైన 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఏకంగా 243 కి.మీ (ఐడీసీ రేంజ్) సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుంది.

అన్ని వేరియంట్లలో జనరేషన్-3 బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 70 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- పవర్‌ఫుల్ మోటార్, హష్‌డ్రైవ్ టెక్నాలజీ

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6.4 kW పీఎమ్‌ఎస్‌ఎమ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 8 బీహెచ్‌పీ పవర్​ని ఉత్పత్తి చేస్తుంది. వెనుక మరొకరు కూర్చున్నా 20 డిగ్రీల ఎత్తు (గ్రేడబిలిటీ) ని సులభంగా ఎక్కేయవచ్చు. ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వేవ్ 'ఎస్' వేరియంట్‌లో గరిష్ఠ వేగం గంటకు 75 కి.మీ కాగా, వేవ్, వేవ్+ మోడళ్లలో గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.

కంపెనీ పేటెంట్ పొందిన 'హష్‌డ్రైవ్' సాంకేతికత వల్ల ప్రయాణ సమయంలో శబ్దం, ప్రకంపనలు (ఎన్​వీహెచ్) 15 శాతం వరకు తగ్గుతాయి. రెగ్యులర్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ల కంటే ఇది శబ్దం లేకుండా, చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- అత్యుత్తమ భద్రత, డిజిటల్ ఫీచర్లు

భద్రత విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కిందపడే పరిస్థితి వస్తే మోటార్ పవర్‌ను ఆటోమేటిక్‌గా ఆపేసే 'డ్రాప్ సేఫ్' ఫీచర్‌ను అందించారు.

"సాధారణ నగర ప్రయాణాల్లో కొండ దిగువలు, ఎత్తు పల్లాల్లో నడపడానికి వీలుగా హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, క్రాల్ మోడ్, లింప్ హోమ్ మోడ్‌లను పొందుపరిచాము," అని కంపెనీ ఇంజనీర్లు వివరించారు.

ఇందులోని 7-ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్ ద్వారా నావిగేషన్, మ్యూజిక్, కాల్ అలర్ట్‌లు పొందవచ్చు. బ్లూటూత్, వాట్సాప్ మెసేజ్ వీక్షణ, లైవ్ లొకేషన్ షేరింగ్, జియోఫెన్సింగ్, ప్రైవసీ కోసం ఇంకాగ్నిటో మోడ్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ పెర్ల్ వైట్, పోలార్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, కోరల్ రెడ్, ట్విలైట్ బ్లాక్, డాల్ఫిన్ గ్రే వంటి 6 రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ కోణార్క్ వంటి ప్రముఖ ఈ-స్కూటర్లకు ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu