Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Electricity bill : వినియోగదారులకు 'కరెంట్' షాక్! అక్కడ 10శాతం పెరగనున్న విద్యుత్ బిల్లు..

Electricity bill : వినియోగదారులకు 'కరెంట్' షాక్! అక్కడ 10శాతం పెరగనున్న విద్యుత్ బిల్లు..

పెట్రోల్​, డీజిల్​, సీఎన్జీ ధరల పెంపుతో అల్లడిపోతున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది! ఇంధన ధరల పెరుగుదల, విద్యుత్ కొనుగోలు వ్యయం ఎక్కువ కావడంతో..

జూన్ నెల నుంచి కరెంట్ బిల్లులను 10 శాతం పెంచుతున్నట్లు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్) అధికారికంగా ప్రకటించింది. జూన్ బిల్లింగ్ సైకిల్ నుంచి ఈ సవరించిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారమే ఈ అదనపు ఇంధన సర్ఛార్జీని విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వేసవి కాలంలో ఇప్పటికే తీవ్రమైన విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్ర ప్రజలకు ఈ కరెంట్​ బిల్లు పెంపు నిర్ణయంతో గట్టి షాక్‌ తగిలింది.

విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కాంలు) ఇంధనం, విద్యుత్ కొనుగోలు కోసం అదనంగా చేసిన ఖర్చును వినియోగదారుల నుంచి రికవరీ చేయడానికి ఈ 'ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్ సర్ఛార్జ్' (ఎఫ్​పీపీఏఎస్) మెకానిజంను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

10శాతం అదనపు భారం ఎందుకు?

రెగ్యులేటరీ అఫైర్స్ యూనిట్ (ఆర్​ఏయూ) చీఫ్ ఇంజనీర్ పంకజ్ సక్సేనా విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం:

మూడు నెలల ఆలస్యం నియమం: నిబంధనల ప్రకారం, ఏదైనా ఒక నిర్దిష్ట నెలలో విద్యుత్ కొనుగోలు, ట్రాన్స్‌మిషన్ కోసం అయ్యే అదనపు ఖర్చును మూడు నెలల తర్వాత వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.

దీని ప్రకారం, మార్చి 2026 లో విద్యుత్ సంస్థలు భరించిన అదనపు వ్యయాన్ని, ఇప్పుడు జూన్ 2026 బిల్లులలో 'ఎఫ్​పీపీఏఎస్' రూపంలో వసూలు చేయనున్నారు.

'ఎమ్వైటీ రెగ్యులేషన్స్, 2025' లోని క్లాజ్ 16(4) ప్రకారం ఈ సర్ఛార్జ్ సరిగ్గా 10 శాతంగా లెక్కించారు.

గృహ, వాణిజ్య వినియోగదారులకు వర్తింపు..

ఈ 10 శాతం అదనపు బాదుడు కేవలం పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని రకాల కేటగిరీల వినియోగదారులకు.. అంటే సాధారణ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు సమానంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు వాడే కరెంట్ యూనిట్లను బట్టి వారి జూన్ బిల్లులో 10% అదనపు మొత్తం జత చేస్తారు. దీనికి సంబంధించిన పారదర్శక లెక్కల షీట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

కరెంట్ కోతలు.. ప్రజల ఆగ్రహం..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పీక్ సమ్మర్ (ఎండకాలం) నడుస్తోంది. విపరీతమైన ఎండల కారణంగా కరెంట్ డిమాండ్ భారీగా పెరిగింది.

అయితే యూపీలో మాత్రం పవర్​ కట్స్​ విపరీతంగా ఉన్నాయి. ఒకవైపు బిల్లులు పెంచుతున్న ప్రభుత్వం, మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటల తరబడి పవర్ కట్స్, సరఫరా కొరతను నివారించలేకపోతోందని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి.

సరైన కరెంట్ సరఫరా ఇవ్వకుండా, నిత్యావసర ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఈ సమయంలో 10 శాతం భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్షాలు, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాబోయే రోజుల్లో జూన్ నెల బిల్లులు చేతికి రావడం ప్రారంభమయ్యాక, ఈ ధరల పెరుగుదల ప్రభావం యూపీ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది వినియోగదారుల జేబులపై గట్టిగానే పడనుంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu