Dailyhunt
ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసాలు.. తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ రిక్వెస్ట్

ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసాలు.. తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ రిక్వెస్ట్

నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ముఖ్యంగా మీ పిల్లలకు నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని లేదా ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని నమ్మబలికే దళారుల మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు.

'గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల వల్ల ఎందరో తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏదైనా విదేశీ యూనివర్సిటీకి వెళ్లాలనుకునే ముందు, ఆ కాలేజీకి భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో గానీ లేదా మీరే స్వయంగా సంప్రదించి తెలుసుకోవాలి.' అని సజ్జనార్ అన్నారు.

అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వకండి, ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా సంబంధిత యూనివర్సిటీ లేదా కాలేజీ బ్యాంక్ ఖాతాలకే చెల్లించాలని హైదరాబాద్ సీపీ తెలిపారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి సాధించిన ఫలితాలను, మీ భవిష్యత్తు కలలను ఈ నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి ఆందోళనకు గురికావద్దన్నారు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

'ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే సంకోచించకుండా డయల్ 100 కి సమాచారం ఇవ్వండి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీ పిల్లలను డాక్టర్లుగా చూడాలనే ఆశతో మోసగాళ్ల మాయమాటల ఉచ్చులో పడకండి.' అని సజ్జనార్ అన్నారు.

Anand Sai, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu