Refrigerator Safety Tips Summer : వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఇంట్లో అందరూ ఎక్కువగా వాడే వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫ్రిజ్ మాత్రమే. చల్లని నీరు, పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా, ఆహారం పాడవకుండా ఉండటానికి నేడు ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అయిపోయింది.
అయితే, ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో, అంతే జాగ్రత్తగా దీన్ని నిర్వహించకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.
ఇటీవల కాలంలో వేసవి ఎండల తీవ్రతకు ఫ్రిజ్ కంప్రెసర్లు పేలిపోతున్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. అధిక వేడి, వోల్టేజ్ సమస్యలు, నిర్వహణ లోపాల వల్ల ఫ్రిజ్ ఒక బాంబులా మారే అవకాశం ఉంది. మీ ఇంట్లోని ఫ్రిజ్ సురక్షితంగా ఉండాలంటే మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను తక్షణమే సరిదిద్దుకోవాలి.
గోడకు ఆనించి ఉంచుతున్నారా…?
చాలా ఇళ్లలో స్థలం తక్కువగా ఉందని ఫ్రిజ్‌ను గోడకు అతుక్కుపోయేలా పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కంప్రెసర్ పని చేస్తున్నప్పుడు అధిక వేడిని విడుదల చేస్తుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య తగినంత ఖాళీ లేకపోతే ఆ వేడి బయటకు వెళ్లడానికి గాలి ఆడదు. దీనివల్ల కంప్రెసర్ మరింత వేడెక్కి (Overheating) పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్‌కు, గోడకు మధ్య కనీసం 5 నుండి 7 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.
స్టెబిలైజర్ లేకపోవడం
వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో నేరుగా ప్లగ్ పాయింట్ నుంచి ఫ్రిజ్‌ను నడిపించడం రిస్క్‌తో కూడుకున్న పని. వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు కంప్రెసర్ మీద లోడ్ పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే నాణ్యమైన స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. ఇది వోల్టేజ్‌ను నియంత్రించి ఫ్రిజ్ ప్రాణాలను కాపాడుతుంది.
వైరింగ్ - పాత ప్లగ్ పాయింట్లు
చలికాలంలో చాలామంది ఫ్రిజ్ వాడకాన్ని తగ్గిస్తారు లేదా ఆపేస్తారు. మళ్లీ ఎండలు రాగానే ఒక్కసారిగా దాన్ని ఆన్ చేస్తారు. ఈ క్రమంలో వైర్లు ఎక్కడైనా ఎలుకలు కొరికాయా లేదా ప్లగ్ సాకెట్ వదులుగా ఉందా అనేది చెక్ చేయరు. వైరింగ్ సరిగ్గా లేకపోతే నిప్పురవ్వలు (Sparks) వచ్చి ఫ్రిజ్‌కు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే వాడకం మొదలుపెట్టే ముందు వైరింగ్‌ను ఒకసారి నిపుణులతో తనిఖీ చేయించడం ఉత్తమం.
అతి తక్కువగా సెట్ చేయకండి…
వస్తువులు త్వరగా చల్లబడాలని చాలామంది ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు (Maximum Cooling) సెట్ చేస్తారు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల కంప్రెసర్ నిరంతరం పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల దానిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పాత ఫ్రిజ్ ఉన్నవారు ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకుండా, సాధారణ స్థాయిలో ఉంచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
మంచు పేరుకుపోవడం….
ఫ్రిజ్ ఫ్రీజర్‌లో మంచు విపరీతంగా పేరుకుపోతున్నా చాలామంది పట్టించుకోరు. గడ్డకట్టిన మంచు కూలింగ్ సిస్టమ్‌పై ఒత్తిడి పెంచుతుంది. ఇది కంప్రెసర్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. వేసవిలో బయటి వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు 'డీఫ్రాస్ట్' (Defrost) బటన్ నొక్కి మంచును కరిగించాలి. అలాగే, ఫ్రిజ్ తలుపును పదేపదే తీయడం లేదా ఎక్కువ సేపు తెరిచి ఉంచడం వల్ల లోపలి కూలింగ్ తగ్గి, కంప్రెసర్ మళ్లీ మళ్లీ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా కంప్రెసర్ లైఫ్ కూడా తగ్గుతుంది.
Maheshwaram Mahendra Chary

