రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేకుండా అనుమతులు జారీ చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రారంభించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.ప్రక్రియను సులభతరం చేయడం, ఏకరీతి ప్రమాణాలను కొనసాగించడం, వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం, పండుగను శాంతియుతంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీజీపీ ఒక ప్రకటనలో వెల్లండిచారు.
గణేష్ ఉత్సవ్ కమిటీలు, మండపాల నిర్వాహకులు www.ganeshutsav.netకు లాగిన్ చేసి, ప్రతిపాదిత మండపం, ప్రదేశానికి సంబంధించిన అవసరమైన వివరాలను సమర్పించవచ్చు. అప్లికేషన్ పరిశీలన, జాయింట్ వెరిఫికేషన్ కోసం పోలీసు, అగ్నిమాపక, మున్సిపాలిటీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పంపిస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత, QR- కోడ్ ఆధారిత డిజిటల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ అవుతుంది.
గణేష్ ఉత్సవ్ కమిటీలు, నిర్వాహకులు ఆన్‌లైన్ సింగిల్ విండో సిస్టమ్‌ను ఉపయోగించాలని, వెరిఫికేషన్ కోసం మండపం వద్ద QR- కోడ్‌ను ప్రదర్శించాలని డీజీపీ కోరారు. గణేష్ ఉత్సవాలు సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అధికారులకు సహకరించాలన్నారు.
మరోవైపు రాబోయే గణేష్ చతుర్థి వేడుకల కోసం సింగిల్-విండో విధానం ద్వారా అనుమతులు పొందేందుకు నెల్లూరు నగరంలోని తాత్కాలిక గణేష్ మండపాల నిర్వాహకులు తమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కోరింది. బుధవారం స్థానిక హోటల్‌లో మండప నిర్వాహకుల సమావేశం జరిగింది.
గణేష్ ఉత్సవ నిర్వాహకులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వేడుకలు, నిమజ్జన ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు ఈ సమితిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెన్నా ఘాట్, నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు చెప్పారు. శివాజీ సెంటర్, ట్రంక్ రోడ్‌లోని టీవీఎస్ కళ్యాణ సదన్‌లో ఉన్న సమితి కార్యాలయం సెప్టెంబర్ 5న తెరుచుకుంటుంది. అనుమతుల కోసం మండప నిర్వాహకులు అక్కడ నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ఐదు రోజుల ఉత్సవాలు సెప్టెంబర్ 14న ప్రారంభమవుతాయి. అనంతరం సెప్టెంబర్ 18న నిర్దేశిత ఘాట్‌ల వరకు ఊరేగింపు, విగ్రహాల నిమజ్జనం జరుగుతాయి.
Anand Sai

