Dailyhunt
Gunde Ninda Gudi Gantalu Today Episode: నీతూకి రవి హగ్.. శృతితో తెగదెంపులు.. బయటపడిన రోహిణి దొంగతనం.. డేంజర్లో పడిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: నీతూకి రవి హగ్.. శృతితో తెగదెంపులు.. బయటపడిన రోహిణి దొంగతనం.. డేంజర్లో పడిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో శృతికి అడ్డంగా దొరికిపోతాడు రవి. నీతూని హగ్ చేసుకుండగా చూడటంతో తెగదెంపుల వరకూ వెళ్తుంది.

అటు మనోజ్ మరోసారి అడ్డంగా బుక్కవడంతో తనతోపాటు తల్లి ప్రభావతినీ ఇరికిస్తాడు. మరోవైపు రోహిణి దొంగతనం బయటపడే సిచువేషన్ వస్తుంది.

మనోజ్‌ను చితకబాదిన బాలు, రవి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 8) ఎపిసోడ్ మనోజ్ ను ఇంట్లో వాళ్లు యాడ్ షూట్ డబ్బుల కోసం నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ముంబై ముకేష్ డబ్బు ఇచ్చినట్లు ఎందుకు చెప్పలేదని బాలు నిలదీస్తాడు. పూర్తయ్యాక చెబుదామనకున్నా అని అనడంతో అవి కూడా మింగేద్దామనుకున్నావా అని బాలు అతన్ని చితకబాదుతాడు. ఈసారి రవి కూడా అతనికి తోడవుతాడు. ఇద్దరూ అతన్ని వెంట పడి మరీ కొడతారు. ఒక దశలో మనోజ్ మీదికి టీపాయ్ తో దాడికి కూడా రవి సిద్దమవుతాడు.

నిజం ఒప్పుకున్న మనోజ్.. సత్యం, ప్రభావతి కూడా..

అటు సత్యం, ప్రభావతి కూడా మనోజ్ ను నిలదీస్తారు. దీంతో మనోజ్ నిజం ఒప్పుకుంటాడు. ఒక్కొక్కరికి పాతిక వేలు ఇచ్చాడని చెబుతాడు. మరి ముందే ఎందుకు నిజం చెప్పలేదని సత్యం అడుగుతాడు. మళ్లీ పూర్తయ్యాక చెబుదామనుకున్నా అని మనోజ్ అనడంతో సత్యం అతన్ని కొడతాడు. అటు ప్రభావతి కూడా కొడుతుంది. ఎవరి డబ్బులు వారికి ఇచ్చేయమని సత్యం అంటాడు.

అందరికీ డబ్బులు ఇచ్చిన మనోజ్.. దొరికిపోయిన ప్రభావతి

దీంతో చేసేది లేక అందరి డబ్బులనూ వాళ్ల అకౌంట్లలో వేస్తాడు మనోజ్. అమ్మకు ఇవ్వవా అని రవి అడిగితే.. తర్వాత ఇస్తానంటాడు. కుదరదు ఇప్పుడే ఇవ్వాలంటే నీకు రూ.15 వేలే ఇస్తానని మనోజ్ అంటాడు. ఎందుకని అడిగితే.. ఇంతకుముందే రూ.10 వేలు ఇచ్చానని చెబుతాడు. దీంతో ప్రభావతి గుట్టు కూడా బయటపడుతుంది. దీంతో బాలు, రవి, మీనా, శృతి వాళ్లను అసహ్యించుకుంటారు. ఆ విషయంలో కూడా మనోజ్ ను ప్రభావతి కొడుతుంది.

రవికి నీతూ ఫోన్.. బాయ్‌ఫ్రెండ్‌గా నటించాలని రిక్వెస్ట్

అటు లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న రవికి నీతూ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. తన ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకుంటున్నారని, తనకు ఇష్టం లేదని చెబుతుంది. అమెరికా నుంచి ఓ వ్యక్తి వచ్చాడని, అతని ముందు తన బాయ్‌ఫ్రెండ్ గా నటిస్తే ఆ పెళ్లి చెడిపోతుందని నీతూ అంటుంది. దీనికి మొదట రవి ఒప్పుకోడు. నీతూ అతన్ని బతిమాలుతుంది. సరే అంటూ.. శృతికి చెప్పి చేస్తానంటాడు. ఆమెకు చెబితే ఒప్పుకోదు అని నీతూ అనడంతో సరే చెప్పకుండానే వస్తాలే అని రవి అంటాడు.

బాలు ఈఎంఐ కట్టిన మీనా, సత్యం

ఇటు బాలు కారు ఈఎంఐ కట్టడానికి వస్తాడు. అప్పటికే మీనా ఆ ఈఎంఐ కట్టేస్తుంది. మనోజ్ ఇచ్చిన డబ్బుతో కట్టానని చెబుతుంది. ఇద్దరిలో ఎవరు కడితే ఏంటిలే అని ఆమె అంటుంది. ఆ తర్వాత సత్యం కూడా అక్కడికి వస్తాడు. బాలుకి తెలియకుండా ఈఎంఐ కట్టాలనుకున్నా అతన్ని ముందే బాలు, మీనా చూస్తారు. తాను కూడా బాలు ఈఎంఐ కట్టడానికి వచ్చానని అనడంతో మీనా కట్టేసిందని బాలు చెబుతాడు. దీంతో మరుసటి నెల ఈఎంఐ కడతానని సత్యం లోనికి వెళ్తాడు.

రవి, నీతూలను చూసేసిన శృతి

నీతూని కలవడానికి స్టైలిష్ గా రెడీ అవుతాడు రవి. అది చూసి శృతి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ముఖ్యమైన మీటింగ్ ఉందంటూ రవి అబద్ధం చెబుతాడు. హడావిడిగా వెళ్లిపోతాడు. అయితే అతడు కోటు మరచిపోవడంతో ఇవ్వడానికి అతని వెంటే వెళ్తుంది శృతి.

ఇటు రెస్టారెంట్ లో అమెరికా నుంచి వ్యక్తికి రవిని తన బాయ్‌ఫ్రెండ్ గా పరిచయం చేస్తుంది నీతూ. రవి కూడా రెండేళ్లుగా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు చెబుతాడు. ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు. అది శృతి చూస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత రవిని నీతూ హగ్ చేసుకొని థ్యాంక్స్ చెబుతుంది.

రవిని మరింత ఇరికించిన నీతూ

అది చూసిన శృతికి మరింత మండుతుంది. శృతి అక్కడ ఉండటం చూసి రవి షాక్ తింటాడు. కోపంతో వెళ్లిపోతున్న ఆమె వెంట వెళ్లి ఇదంతా నాటకం అని చెబుతాడు. అయినా శృతి నమ్మదు. నీతూతో నిజం చెప్పిద్దామనుకుంటాడు. కానీ నీతూ మాత్రం రవిని ఆట పట్టించాలనుకొని మన లవ్ విషయమా అంటూ శృతి ముందు మరింత డ్రామా ఆడుతుంది. దీంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇంటికి రా నీ సంగతి చెబుతా అంటూ కోపంగా వెళ్లిపోతుంది శృతి.

రోహిణి దొంగతనం బయటపడుతుందా?

ఇటు కామాక్షి ఇంటికి వస్తుంది ప్రభావతి. ఆ తర్వాత మీనా కూడా పూలు తీసుకొని అక్కడికి వస్తుంది. వాళ్లకు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంది మీనా. ఇంతలో ప్రభావతి స్టూడెంట్ తన తల్లిని తీసుకొస్తుంది. ఆమె ప్రభావతిని పరిచయం చేసుకొని తాను చీరల బిజినెస్ చేస్తానంటూ వెంట తీసుకొచ్చిన చీరలను చూపిస్తుంది. అందులో ఒకటి ప్రభావతికి బాగా నచ్చుతుంది. దాని ఖరీదు రూ.45 వేలు అని చెప్పడంతో ప్రభావతి షాక్ తింటుంది.

అయితే కామాక్షి ఇంట్లోనే ఉన్న తన రూ.2 లక్షలతో ప్రభావతి ఆ చీర కొనడానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది రోహిణి దొంగతనాన్ని బయటపెడుతుందా? ఆ సమయంలో వంటింట్లోనే ఉన్న మీనాను ఇది డేంజర్లో పడేస్తుందా అన్న అనుమానం కలిగిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu