Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప

లియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందా... గోవిందా... అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమభక్తుడైన హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా నిలుస్తాడు.

గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుల దివ్యసంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటిచెబుతుంది. హనుమంత వాహనంపై కోదండరాముని దర్శించుకోవడం ద్వారా భక్తులకు భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింతగా పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానం అందించారు. నెల్లూరు లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నారని తెలిపారు. స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమన్నారు. శ్రీవారి కృపాకటాక్షాలు వేమిరెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.

సింగపూర్‌ కళాకారుల సీతారామ కళ్యాణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ

తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించుకునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు. గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో 8 రకాల ఆహార పదార్థాలు, 7 రకాల పానీయాలు ఉన్నాయి.

భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్‌ అందించేలా ఏర్పాట్లు చేసింది. గరుడసేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు తదితర సౌకర్యాలను అందించింది.

Anand Sai, Tirumala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu