Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Healthy Sleep : 8 గంటలు నిద్రపోతున్నా అలసటగా ఉంటోందా.? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు

Healthy Sleep : 8 గంటలు నిద్రపోతున్నా అలసటగా ఉంటోందా.? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు

Healthy Sleep Cycle Tips : మానవ శరీరానికి, మనస్సుకు ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీరం అంతర్గతంగా దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు (రిపేర్) చేసుకుంటుంది.

అలాగే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటలు, సగటున 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, ఏ సమయంలోనైనా సరే 8 గంటలు నిద్రపోతే సరిపోతుందా…? అంటే.. అస్సలు సరిపోదని అంటున్నారు స్లీప్ మెడిసిన్ వైద్యుడు అబినాష్ జోషి. ఈ విషయమై ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలు విషయాలను పంచుకున్నారు.

వైద్యుల నివేదిక ప్రకారం, మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనినే 'సిర్కాడియన్ లయ' (Circadian Rhythm) అంటారు. సాధారణంగా మన శరీరం రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 07:00 గంటల మధ్య నిద్రపోవాలని ఆశిస్తుంది. ఒకవేళ ఈ సమయాన్ని కాదని అర్ధరాత్రి దాటాక ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం ఎప్పుడో లేచి 8 గంటల కోటాను పూర్తి చేసినా శరీరానికి నష్టం తప్పదు. ఎందుకంటే బాడీ క్లాక్ మీ నిద్ర గంటలను కాదు.. మీరు ఏ సమయానికి నిద్రపోతున్నారనే అంశాన్ని మాత్రమే లెక్కిస్తుంది. ఈ లయ తప్పితే శరీరంలోని హార్మోన్లు, ఉష్ణోగ్రత, కణాల మరమ్మత్తు ప్రక్రియలన్నీ పూర్తిగా స్తంభించిపోతాయి.

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు:

  • గుండె జబ్బుల ముప్పు : నిరంతరం రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది మరియు అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది.
  • మధుమేహం (డయాబెటిస్) : శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం క్రమంగా తగ్గిపోతుంది. ఇది కొన్నిసార్లు నేరుగా ప్రీడయాబెటిక్ స్థాయిలకు దారితీస్తుంది.
  • జన్యువులపై ప్రభావం : సిర్కాడియన్ లయ తప్పడం వల్ల మన శరీరంలోని సాధారణ లయబద్ధమైన జన్యువులలో 97 శాతం కంటే ఎక్కువ అంతరాయం కలుగుతుంది.
  • మానసిక సమస్యలు : నిద్రపోయే సమయం మారడం వల్ల తీవ్రమైన నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు చుట్టుముడతాయి.
  • నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి చిట్కాలు:

ఆరోగ్యకరమైన బాడీ క్లాక్‌ను తిరిగి సొంతం చేసుకోవడానికి వైద్యులు పలు సూచనలు ఉదయం నిద్ర లేచిన 1-2 గంటల్లోపు కనీసం 30 నిమిషాల పాటు ఎండలో గడపాలి. నిద్ర సమయాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గం.

  • మీరు పడుకోవాలని అనుకునే సమయానికి 2-3 గంటల ముందే గదిలోని లైట్ల వెలుతురును తగ్గించుకోవాలి (డిమ్ చేయాలి).
  • వైద్యుల సలహా మేరకు చిన్న మొత్తంలో మెలటోనిన్ తీసుకోవాలనుకుంటే.. దానిని నిద్రపోయే ముందు కాకుండా, మీ ప్రస్తుత నిద్రవేళకు 1.5 నుండి 6 గంటల ముందే తీసుకోవాలి.
  • ఉదయం నిద్ర లేవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకుని, దానిని వారాంతాల్లో (వీకెండ్స్) కూడా ఖచ్చితంగా పాటించాలి.
  • మీకు రాత్రిపూట అంత త్వరగా నిద్రపట్టకపోతే.. పడుకునే ముందు ఒక మంచి పుస్తకం చదవడం లేదా మెలోడీ (తేలికపాటి) సంగీతం వినడం ద్వారా మెదడు ప్రశాంతపడి త్వరగా నిద్ర పడుతుంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu