Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
How to maintain clothes : మీ దుస్తులు ఎప్పటికీ కొత్తవిగా మెరవాలా? ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ చెప్పిన సీక్రెట్స్..

How to maintain clothes : మీ దుస్తులు ఎప్పటికీ కొత్తవిగా మెరవాలా? ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ చెప్పిన సీక్రెట్స్..

ట్రెండ్లు ప్రతిరోజూ మారిపోతున్నాయి. వారం తిరిగేసరికి కొత్త రకం మోడళ్లు, డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే కొత్త మోడల్ రాగానే పాత బట్టలను పక్కన పడేయడం వల్ల జేబు ఖాళీ అవ్వడమే కాక, పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.

అందుకే ప్రస్తుతం 'కాన్షియస్ ఫ్యాషన్' పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. కొనే ప్రతి దుస్తులు వార్డ్‌రోబ్‌లో ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది.

ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఉన్న బట్టలనే ఎక్కువ కాలం ఎలా కాపాడుకోవచ్చో 'జూలియట్ అపారెల్స్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రుతిక్ త్రెవాడియా కొన్ని కీలకమైన సూచనలు అందించారు.

లేబుల్ సూచనలను కచ్చితంగా పాటించండి..

"దుస్తుల రక్షణ అనేది మనం వాటిని శుభ్రం చేసే విధానం పైనే ఆధారపడి ఉంటుంది," అని క్రుతిక్ త్రెవాడియా పేర్కొన్నారు. ప్రతీ దుస్తులపై ఇచ్చే వాషింగ్ సూచనలను కచ్చితంగా చదివి పాటించాలి. అవసరం లేకపోయినా పదే పదే ఉతకడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతింటుంది. సరైన నీటి ఉష్ణోగ్రత వాడటం, ఆరబెట్టే సమయంలో ఎక్కువ వేడి తగలకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇన్నర్‌వేర్, యాక్టివ్‌వేర్, లాంజ్‌వేర్ వంటి వాటికి ఇది మరింత వర్తిస్తుంది. వీటిలో సాగే గుణం (ఎలాస్టిసిటీ), ఫిట్టింగ్ దెబ్బతింటే అవి వేసుకోవడానికి పనికిరావు.

స్టైలింగ్‌తో కొత్త లుక్ సొంతం చేసుకోండి..

ఒకే డ్రెస్సును వేర్వేరు రకాలుగా కాంబినేషన్ చేసి వేసుకోవడమే అసలైన స్టైలింగ్ నైపుణ్యం. ఒక మంచి ప్లెయిన్ టీ-షర్ట్ లేదా షర్ట్‌ను రకరకాల జాకెట్లు, డెనిమ్స్, లేదా యాక్సెసరీస్‌తో కలిపి వేసుకుంటే ప్రతిసారీ ఒక కొత్త లుక్ వస్తుంది. దీనివల్ల ప్రతీ ఈవెంట్‌కు కొత్త బట్టలు కొనాల్సిన అవసరం ఉండదు. డబ్బు ఆదా అవ్వడంతో పాటు స్టైలిష్‌గా కనిపిస్తారు.

ఫ్యాబ్రిక్ స్వభావాన్ని తెలుసుకోండి..

ప్రతి వస్త్రం ఒకేలా ఉండదు. పట్టు, కాటన్, సింథటిక్, ఉన్ని వంటి దుస్తులకు వేర్వేరు రకాల సంరక్షణ అవసరం. దుస్తులపై వచ్చే బూజు, దారాల ఫైబర్​ని స్మూత్​గా తొలగించడానికి లింట్ రోలర్లు, స్వెటర్ కాంబ్‌లు, క్లాత్ బ్రష్‌లను ఉపయోగించవచ్చు. ఇవి తక్కువ శ్రమతో దుస్తులను మళ్లీ కొత్తవిగా మెరిపిస్తాయి.

మరమ్మత్తులు, రీసైక్లింగ్ అలవాటు చేసుకోండి..

కొద్దిగా దారం ఊడిపోతే లేదా చిన్న మరకపడితే వెంటనే ఆ దుస్తులను పారేయడం సరైన పద్ధతి కాదు. "ప్రతిసారీ బట్టలను పారేయడం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది," అని క్రుతిక్ త్రెవాడియా హెచ్చరించారు. నేడు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఒకే అవుట్‌ఫిట్‌ను వేర్వేరు కార్యక్రమాల్లో తిరిగి వేసుకోవడాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. రీ-యూజ్, రీ-పర్పస్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.

భద్రపరిచే విధానం సరిగ్గా ఉండాలి..

చివరిగా.. దుస్తులను భద్రపరిచే పద్ధతిపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల బట్టలను బీరువాలో ఒకేలా కుక్కేయకూడదు. పట్టు వస్త్రాలు, డెలికేట్ ఫ్యాబ్రిక్స్, ఉన్ని దుస్తులకు వేర్వేరు రకాల స్టోరేజ్ పద్ధతులు ఉంటాయి. బట్టలు కొనేటప్పుడు ఇచ్చే స్టోరేజ్ మార్గదర్శకాలను గమనించి, వాటి ప్రకారం మడతపెట్టడం లేదా హ్యాంగ్ చేయడం వల్ల అవి చాలా కాలం పాటు కొత్తవిగా ఉంటాయి.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu