Dailyhunt
Hyderabad : దోమ తెర ధరించి, ఫాగింగ్ మెషీన్‌తో అసెంబ్లీకి ఎమ్మెల్యే - సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

Hyderabad : దోమ తెర ధరించి, ఫాగింగ్ మెషీన్‌తో అసెంబ్లీకి ఎమ్మెల్యే - సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

దోమల నియంత్రణ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిసరన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్‌ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు.

అనుమతి లేదని మార్షల్స్‌ అడ్డుకోగా.. వారిని ప్రతిఘటించారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ప్రశ్నించారు.

దోమలు విపరీతంగా పెరిగాయి - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఆ తర్వాత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్‌ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. నగరంలో రోజురోజుకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోమల నియంత్రణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జంటనగరాల్లోని చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు అధికంగా పేరుకుపోవడంతో…. వాటిలో దోమలు విస్తృతంగా పెరుగుతున్నాయని తెలిపారు.

ఉదయం మరియు సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లే ప్రజలు దోమల కారణంగా మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వస్తాయేమోనని భయపడుతున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి చెప్పారు. చాలా మంది వాకింగ్‌కు రావడానికి వెనుకాడుతున్నారని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు పేరుకుపోకుండా డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుని విజయవంతం చేశామని చెప్పారు. అలాగే దోమల లార్వాను నియంత్రించేందుకు గంబూజియా జాతి చేప పిల్లలను చెరువుల్లో వదిలి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. డ్రోన్ సాంకేతికతతో చెరువు మధ్య ప్రాంతాల్లో కూడా మందులు పిచికారీ చేయడం జరిగిందని చెప్పారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం… ప్రజా ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకుండా, చెరువుల్లో పేరుకుపోతున్న గుర్రపుడెక్క ఆకును తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి…. తక్షణ చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి కోరారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu