ఓ వైపు వేసవి మెుదలైంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మెుదలైంది. ట్యాంకర్ల కూడా భారీగా డిమాండ్ ఉంది. జలమండలి కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. దూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ వాసులకు అందిస్తోంది.
కొందరు మాత్రం నల్లాకు మోటర్లు బిగించి.. మిగతావారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా నీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చుకునే వినియోగదారులపై HMWSSB రూ.5,000 జరిమానా విధించనుంది.
తమకు నీటి సరఫరాను పెంచుకోవడానికి కుళాయి కనెక్షన్లపై మోటార్లను అక్రమంగా ఉపయోగించే వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ (HMWS&SB) తెలిపింది. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై పోలీసు చర్య కూడా తీసుకోవచ్చు.
'కొన్ని ప్రాంతాల నుంచి లో వాటర్ ప్రెజర్‌కు సంబంధించి మాకు ఫిర్యాదులు అందాయి. అక్రమ మోటార్లే దీనికి కారణమని మా ప్రాథమిక విచారణలో తేలింది. కాలనీలకు నీటి సరఫరా జరిగే సమయంలో మేం ఆయా ప్రాంతాలను సందర్శిస్తాం.' అని హైదరాబాద్ వాటర్ బోర్డు చెబుతోంది.
కొన్ని ప్రాంతాల్లో ఆటోమేటిక్, హై-స్పీడ్ మోటార్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల నీటి సరఫరా లైన్ల చివరన ఉన్న వారి ప్రాంతంలోని ఇతర కుటుంబాలకు తగినంత తాగునీరు అందడం లేదని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ చెబుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను కవర్ చేసే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) ప్రాంతంలో బృందాలను ఏర్పాటు చేశారు.
మెట్రో కస్టమర్ కేర్ నంబర్ 155313, HMWSSB వినియోగదారుల సేవల మొబైల్ యాప్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు అధికారులు. ఇంటింటికీ తనిఖీలు నిర్వహించనున్నారు. నల్లాకు మోటర్లు బిగించినవారిపై చర్యలు తీసుకుంటారు.
నీటి ప్రెషర్ కోసం ఉపయోగించే సాధారణ మోటర్లు మాత్రమే కాకుండా.. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ఆటోమెటిక్ మోటర్లు వాడుతున్నారు. దీంతో హైస్పీడ్ ప్రెషర్ పెరిగి చివరి కనెక్షన్‌దారులకు నీటి సరఫరా జరగడం లేదు. ఇలాంటి చర్యలు మిగతా కనెక్షన్లకు పెద్ద సమస్యగా మారాయని జలమండలి అధికారులు చెబుతున్నారు.
Anand Sai, Hyderabad

