Dailyhunt
Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

బుద్వెల్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలతో కొత్త హైకోర్టు సముదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన భవన నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు.

రాష్ట్రంలో న్యాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయవ్యవస్థ పనితీరు కోసం అత్యాధునిక సౌకర్యాలను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

ప్రతిపాదిత 100 ఎకరాల జ్యుడీషియల్ సిటీలో భాగంగా ఉన్న ఈ జోన్-II కాంప్లెక్స్‌కు ఈ కార్యక్రమంలో భూమి పూజ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణాళికాబద్ధమైన భవన సముదాయాలను ప్రదర్శించే ఒక నమూనా ప్రదర్శనను కూడా సమీక్షించారు.

తెలంగాణలో హైకోర్టు కొత్త సముదాయ నిర్మాణం అద్భుతంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. తెలంగాణ హైకోర్టుకు ఇది ముఖ్యమైన ప్రాజెక్టు అన్నారు. కోర్టు గదులు మాత్రమే కాదని, వాటి వెనక పెద్ద వ్యవస్థ ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ సజావుగా నడిపేందుకు మౌలిక వసతులు చాలా అవసరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా.. ఆలోచన చేసి నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేపట్టిందన్నారు.

'పాత హైకోర్టు చారిత్రాత్మకమైనది. కానీ ప్రస్తుతం సరిపోవడం లేదు. ఈ కారణంగా ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా లేదు. వచ్చే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. నూతన హైకోర్టు నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.' అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu