Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే టెండర్లు - తుది దశలో స్ధలాల సేకరణ

Hyderabad : క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే టెండర్లు - తుది దశలో స్ధలాల సేకరణ

హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజల సొంతింటి కలను నైజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. క్యూఆర్ (CURE) పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుంది.

ఈ వివరాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని…. మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఈ ల్యాండ్ అక్వైజేషన్ పూర్తి కానుందని స్పష్టం చేశారు.

ఇళ్ల పట్టాలు పంపిణీ…

గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొని పేదలకు గృహ హక్కు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం "ప్రతి పేద కుటుంబానికి ఇల్లు" అనే నినాదం, లక్ష్యంతో నిజాయితీగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూఆర్ పరిధిలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని మొదటి విడతలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాబోయే రెండు, మూడు విడతల్లో మరిన్ని ఇళ్లను మంజూరు చేసి అర్హులందరికీ గూడు కల్పిస్తామని చెప్పారు. ధూల్‌పేటలో ఇళ్లు రాని మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో భూమి విలువ ఎకరాకు రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు పలుకుతోందని, అయినా సరే పేదల సంక్షేమం కోసం ఆ భూముల విలువను పక్కనబెట్టి అదే విలువైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ ఇళ్లు నిర్మించి చూపిస్తామని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే ఛాలెంజ్ చేశానని…. అయితే ఆ సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో పాలకులకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu