Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad Metro Phase 2 : మెట్రో రైల్ విస్తరణకు త్వరగా అనుమతులు ఇవ్వండి - కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ

Hyderabad Metro Phase 2 : మెట్రో రైల్ విస్తరణకు త్వరగా అనుమతులు ఇవ్వండి - కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ

భాగ్యనగర భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో ఫేజ్-II విస్తరణ పనులకు అవసరమైన కేంద్ర అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.

ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు పంపారు.

లేఖలో కీలక అంశాలు…

ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లేఖలో గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న ఉమ్మడి నిర్ణయాల ప్రకారం.. మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను ఖచ్చితంగా నిర్ధారించడం , అధిక వడ్డీతో కూడిన రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను ఒక నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని భావించారు. దీనితో పాటు ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ (SBI CAPS)ను నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటాన్ని లేఖలో ఎత్తి చూపారు. ఈ జాప్యంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-I రోజువారీ నిర్వహణలో అనేక ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అలాగే ఫేజ్-II కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు భవిష్యత్తులో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే పూర్తి చేయండి - సీఎం రేవంత్

హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎంతో కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని…. ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలై, మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ త్వరగా ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఫేజ్-II విస్తరణ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu