Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
iPhone 18 release date : ఇట్స్ అఫీషియల్​! ఐఫోన్ 18 సిరీస్ లాంచ్​ డేట్ ఇదే..

iPhone 18 release date : ఇట్స్ అఫీషియల్​! ఐఫోన్ 18 సిరీస్ లాంచ్​ డేట్ ఇదే..

టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ డేట్​ని అధికారికంగా ఖరారు చేసింది. రాబోయే సెప్టెంబర్ 9వ తేదీన అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లోని ప్రతిష్టాత్మక 'స్టీవ్ జాబ్స్ థియేటర్' వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.

కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జరుగుతున్న తొలి అతిపెద్ద కార్యక్రమం కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

"సర్‌ప్రైజ్ అండ్ షైన్" అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో యాపిల్ ఒక ఆహ్వాన పత్రాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 సిరీస్​ లాంచ్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాపిల్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు!

ఇన్నాళ్లూ యాపిల్ ప్రయాణాన్ని విజయవంతంగా నడిపిన టిమ్ కుక్ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. టిమ్ కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ నాయకత్వ మార్పు తర్వాత జరుగుతున్న మొదటి ఈవెంట్ కావడం వల్ల, కేవలం కొత్త గ్యాడ్జెట్లు మాత్రమే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో యాపిల్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో టెర్నస్ వివరించే అవకాశం ఉంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రేసులో యాపిల్ స్థానాన్ని టెర్నస్ మరింత బలపరుస్తారని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లోకి యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్?

ఈ లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం - యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొస్తుండడమే! ప్రస్తుతం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌తో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 8 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 1.75 లక్షల వరకు ఉందనే విషయం తెలిసిందే. ఇప్పుడు యాపిల్ కూడా ఈ విభాగంలోకి అడుగుపెడితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తుంది.

కాగా యాపిల్ రాకను శాంసంగ్ కూడా స్వాగతించింది. "ఈ విభాగంలో ఎంత ఎక్కువ ప్రచారం, పోటీ ఉంటే అంత మంచిది," అని శాంసంగ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బ్లాకర్డ్ వ్యాఖ్యానించారు.

అయితే, ఈసారి ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్​, ఫోల్డబుల్ మోడల్స్​ మాత్రమే లాంచ్​ అవుతాయని, స్టాండర్డ్ ఐఫోన్ 18 స్మార్ట్​ఫోన్ మాత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుందని అంచనాలు ఉన్నాయి. వీటిపై సంస్థ స్పందించాల్సి ఉంది.

ఐఫోన్ 18 సిరీస్ లాంచ్- భారత్‌లో ఈవెంట్ సమయం..

భారతీయ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ఈ ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్​ఎల్​ఎం) సాంకేతికతతో పనిచేసే సరికొత్త 'సిరి ఏఐ' వాయిస్ అసిస్టెంట్‌ను కూడా యాపిల్ పరిచయం చేయనుంది. ఇది మెసేజింగ్, క్యాలెండర్ వంటి యాప్‌లను మరింత చాకచక్యంగా ఆపరేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, సెప్టెంబర్ 22 నాటికి వినియోగదారులకు అందనున్న కొత్త మ్యాక్ మిని, మ్యాక్ స్టూడియో మోడళ్ల వివరాలను కూడా ఈ వేదికపై ప్రకటించనున్నారు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu