IPL 2026 Gujarat Titans vs Punjab Kings : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT) విజయం సాధించింది.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
జేసన్ హోల్డర్ తన స్పెల్‌తో పంజాబ్ బ్యాటర్లను వణికించగా… ఛేదనలో సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ 'ఫినిషింగ్ టచ్' గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాయి. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా…. పంజాబ్ కింగ్స్ ఓడినా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే పంజాబ్‌కు షాకిచ్చాడు. మొదటి ఓవర్ రెండో బంతికే ప్రియాంశ్ ఆర్య (2)ను అవుట్ చేసిన సిరాజ్…. తర్వాతి బంతికే కూపర్ కొన్నోలీని డకౌట్‌గా వెనక్కి పంపాడు. దీంతో పంజాబ్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (15) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా రబాడ ఆ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం రంగంలోకి దిగిన జేసన్ హోల్డర్ పంజాబ్ మిడిలార్డర్‌ను దెబ్బకొట్టాడు. నెహాల్ వధేరాను సున్నాకే వెనక్కి పంపిన హోల్డర్… కీలక సమయంలో అయ్యర్‌ను కూడా అవుట్ చేశాడు. పంజాబ్ 10 ఓవర్లలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సూర్యాంష్ షెడ్జ్ (57; 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (40; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆరో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. హోల్డర్ చివరికి 4 వికెట్లతో పంజాబ్‌ను 20 ఓవర్లలో 163/9 పరుగులకే పరిమితం చేశాడు.
సాయి సుదర్శన్ థర్డ్ ఫిఫ్టీ…
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ గిల్ (5) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే సాయి సుదర్శన్ (57; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును రేసులో నిలిపాడు. జోస్ బట్లర్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. బట్లర్ అవుట్ అయిన తర్వాత సుదర్శన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ సీజన్‌లో మూడో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చివరి ఓవర్ లో ఉత్కంఠ….
చివరి 3 ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు కావాల్సి ఉంది. అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్లో హోల్డర్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా…. స్టోయినిస్ వేసిన బంతుల్లో వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అదరగొట్టాడు. అర్షద్ ఖాన్ (8 నాటౌట్) సహకారంతో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఆసక్తికరంగా ఫ్లే ఆఫ్ రేస్….
పంజాబ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో గుజరాత్ టైటాన్స్ .. సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ సరసన చేరింది. 10 మ్యాచులలో ఆరు విజయాలు(12 పాయింట్లు) సాధించింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచులో ఓడినా.. పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
వరుస విజయాలతో సత్తా చాటాతున్న గుజరాత్… ఐదు స్థానంలోకి చేరటంతో ఫ్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. రాబోయే మ్యాచ్ లు ప్రతి టీమ్ కు సవాల్ గా మారాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రాజస్థాన్ జట్టులకు ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ప్రస్తుతం మూడో స్థానంలో హైదరాబాద్, నాల్గో స్థానంలో రాజస్థాన్ ఉండగా… ఐదో స్థానంలో గుజరాత్ నిలిచింది.
Maheshwaram Mahendra Chary

