హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ (IPL) సందడిని ఆసరాగా చేసుకుని అక్రమంగా కోట్లు సంపాదించాలని చూసిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
సామాన్య ప్రజలకు టికెట్లు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో…. ఈ ముఠా ఏకంగా న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్ల పేరిట ఫోర్జరీ లెటర్ హెడ్లను సృష్టించి ఖరీదైన టికెట్లను దక్కించుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమయంలో స్టేడియం పార్కింగ్ ఏరియాలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ, భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. తక్షణమే రంగంలోకి దిగిన బందోబస్తు బృందం వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా…. ఒక్కొక్కటి రూ. 22,000 విలువ చేసే ఐదు కాంప్లిమెంటరీ టికెట్లు లభ్యమయ్యాయి.
విస్తుపోయే నిజాలు….
పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన విషయాలు విస్మయానికి గురిచేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ముగ్గురు నిందితులు, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్న నిందితులతో కలిసి ఈ భారీ స్కామ్‌కు తెరలేపారు.
ఇంటర్నెట్ నుంచి వివిధ రాష్ట్రాల మంత్రులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జీల అధికారిక లెటర్ హెడ్లను డౌన్‌లోడ్ చేశారు. ఆ లెటర్ హెడ్లపై వారి సంతకాలను ఫోర్జరీ చేసి, వీవీఐపీ కోటాలో టికెట్లు కావాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు విన్నవించారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మిన అసోసియేషన్లు వారికి అత్యంత ఖరీదైన గ్యాలరీలకు సంబంధించిన కాంప్లిమెంటరీ టికెట్లను జారీ చేశాయి. అలా ఉచితంగా లేదా నామమాత్రపు ధరతో పొందిన టికెట్లను బయట బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిందితుల నుంచి ఉప్పల్ పోలీసులు ఒక కారు, ఐదు ఐపీఎల్ టికెట్లు (మొత్తం విలువ రూ. 1.10 లక్షలు), ఐదు మొబైల్ ఫోన్లు, ఐదు ఫోర్జరీ చేసిన వీవీఐపీ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
క్రికెట్ అసోసియేషన్లు కూడా ఇలాంటి లెటర్ హెడ్లు వచ్చినప్పుడు వాటి ప్రామాణికతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని… లేకపోతే ఇలాంటి మోసగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Maheshwaram Mahendra Chary

