పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో, మధ్యవర్తులు ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణను ఇరాన్ తిరిస్కరించింది!
తమకు తాత్కాలిక శాంతి వద్దని, యుద్ధం శాశ్వతంగా ముగిసి తీరాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు మరింత ఘాటుగా మారాయి. పౌర లక్ష్యాలే కాదు, అవసరమైతే ఇరాన్ దేశాన్ని మొత్తంగా ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
ట్రంప్ హెచ్చరిక: "ఒక్క రాత్రికే అంతా ముగిసిపోవచ్చు"
వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. "ఒక్క రాత్రిలోనే ఒక దేశాన్ని మ్యాప్ నుంచి తొలగించవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు!" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం రాత్రి 8 గంటల లోపు (అమెరికా కాలమానం ప్రకారం- ఇండియాలో బుధవారం ఉదయం) ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ఒకవేళ ఇరాన్ లొంగకపోతే జరిగే దాడులు అంతకు ముందు ఎన్నడూ చూడని రీతిలో ఉంటాయని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ హెచ్చరించారు. "మొదటి రోజు కంటే ఈరోజు దాడుల ఉధృతి ఎక్కువ.. రేపు అది ఇంకా పెరుగుతుంది," అని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ దెబ్బ..
అమెరికా హెచ్చరికలకు తోడు, ఇజ్రాయెల్ యుద్ధ క్షేత్రంలో దూకుడు పెంచింది. ఇరాన్ ఇంధన అవసరాలకు కీలకమైన 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజిద్ ఖదేమీతో పాటు, కుద్స్ ఫోర్స్ అండర్ కవర్ యూనిట్ లీడర్ అస్గర్ బకేరి మరణించారు. 93 మిలియన్ల జనాభా ఉన్న ఇరాన్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఈ గ్యాస్ ఫీల్డ్ అత్యంత కీలకం. "వాళ్లను ఒక్కొక్కరినీ వేటాడి చంపుతాం" అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శపథం చేశారు.
ఇరాన్ వాదన: "ట్రంప్‌ను నమ్మలేం"
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ తన 10 అంశాల స్పందనను తెలియజేసింది. ఇందులో ఆంక్షల తొలగింపు, పునర్నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి.
"యుద్ధం పూర్తిగా ముగిసి, మళ్లీ మాపై దాడి జరగదని గ్యారెంటీ ఇస్తేనే మేము శాంతికి అంగీకరిస్తాం," అని కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తబా ఫెర్దౌసీ పూర్ స్పష్టం చేశారు. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా రెండుసార్లు దాడులు చేయడాన్ని ఆయన గుర్తు చేస్తూ, అమెరికా అధ్యక్షుడి యంత్రాంగాన్ని తాము నమ్మడం లేదని పేర్కొన్నారు.
స్తంభించిన జనజీవనం.. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు!
నేతల ఆటల్లో సామాన్యులు బలమైపోతున్నారు! టెహ్రాన్ నగరంలో బాంబుల మోత, ఎయిర్ డిఫెన్స్ గన్‌ల శబ్దాలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
"నిరంతరం బాంబుల శబ్దం వినిపిస్తూనే ఉంది.. భయం పోవడానికి నిద్రమాత్రలు వాడుతున్నాం" అని ఒక స్థానికుడు వాపోయారు.
ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్‌లోని మూడు విమానాశ్రయాలు ధ్వంసమవడమే కాకుండా, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు కాలిబూడిదయ్యాయి.
ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లకు చేరుకుంది. ఇది యుద్ధం మొదలైనప్పటి కంటే 50 శాతం ఎక్కువ. అటు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ హిజ్బుల్లా వ్యతిరేక పార్టీ నాయకుడు ఆయన కుటుంబంతో సహా మరణించారు. ఇప్పటివరకు ఇరాన్‌లో 1,900 మంది, లెబనాన్‌లో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించింది?
తాత్కాలిక విరామం కాకుండా, యుద్ధానికి శాశ్వత ముగింపు, మళ్లీ దాడులు జరగవనే గ్యారెంటీ కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
2. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ఏంటి?
మంగళవారం రాత్రి 8 గంటల లోపు ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాలని, లేనిపక్షంలో తీవ్ర దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
3. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌లో తలెత్తిన ప్రధాన నష్టం ఏంటి?
ఇరాన్ ఇంధన, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌తో పాటు కీలక సైనిక కమాండర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.
Chitturi Eswara Karthikeya Sharath

