హిందూ సంప్రదాయంలో ప్రతి నెలా ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించకపోయినా..
దైవారాధనకు పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆకాశంలో జరిగే అద్భుత ఖగోళ మార్పులకు, ఆధ్యాత్మిక సాధనలకు ఈ మాసం వేదికగా నిలుస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది. జులై నెలలో గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, కొత్త పనులు మెుదలుపెట్టేందుకు జులై 1, 2, 3, 4, 5, 6 తేదీలు అత్యంత అనుకూలమైన రోజులు.
ఖగోళ శాస్త్రం ప్రకారం జూలై నెలలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. జూలై 17వ తేదీ ఉదయం 11:04 గంటలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే 'కర్కాటక సంక్రమణం' లేదా దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఇప్పటివరకు ఉత్తరం వైపు ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిశగా తన ప్రయాణాన్ని మెుదలుపెడతాడు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే.. దక్షిణాయనం రాత్రి కాలంతో సమానంగా భావిస్తారు. ఈ ఆరు నెలల కాలంలో పితృదేవతల ఆరాధన, దానధర్మాలు, వ్రతాలు చేయడం వల్ల అమితమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
ఈ నెల జులై 29న అత్యంత పవిత్రమైన వ్యాస పూర్ణిమ(గురు పూర్ణిమ) రానుంది. ఈ ఏడాది గురుపూర్ణిమ నాడు గురు గ్రహం ఉచ్ఛ రాశిలో ఉండటం విశేషం. రవి, గురు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ పుణ్యకాలంలో ధ్యానం, జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
జూలై 3 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురుస్తాయి. సంకట హర చతుర్థి కూడా ఇదే రోజు. గణపతి ఆరాధన చేస్తారు.
జూలై 4 శుక్రుడు సింహరాశిలోకి, కుజుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
- జూలై 10యోగిని ఏకాదశి ఉంది. ఆరోగ్య ప్రాప్తి కోసం పూజలు చేస్తారు.
- జూలై 12, 26 ప్రదోష వ్రతం (శివారాధనకు శ్రేష్ఠం)
- జూలై 15 ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది.
- జూలై 16 పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం
- జూలై 25న తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) - చాతుర్మాస్య దీక్షల ప్రారంభం
Anand Sai

