Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో తిరుమల వెళ్తున్నారా? శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్

జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో తిరుమల వెళ్తున్నారా? శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్

జులై నెల నుండి సెప్టెంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు పలు తేదీల్లో రద్దు అవుతున్నాయి.

ఆ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రేక్ దర్శనాలు రద్దైన తేది వివరాలు కింది విధంగా ఉన్నాయి.

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

జులై 17న ఆణివార ఆస్థానం.

జులై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద.

జులై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం.

ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ.

సెప్టంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

సెప్టంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

సెప్టంబర్ 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

పై తేదిలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

ప్రతి రెండు నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ బస్సు

రిలయన్స్ సంస్థ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, పవర్ సప్లై, డ్రైవర్ల నిర్వహణ, వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ నడుపుతున్న 15 బస్సులతో పాటు అదనంగా మరో పది బస్సుల కోసం మొత్తం 50 బస్సుల సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచాలని రిలయన్స్ బృందాన్ని కోరారు. 10×30 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఒక్కో బస్సులో 50 మంది సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

బస్సులు త్వరగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా 2 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు వెంకయ్య చౌదరి. బస్సులను నడిపేందుకు 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బస్సుల లెక్కన రెండు షిఫ్టుల్లో 50 బస్సులు తిప్పేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

బస్సుల పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని గుర్తించి రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించి త్వరితగతిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బస్సులో అధునాతన ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి రాబోయే బస్టాప్ ల వివరాలు భక్తులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu