దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో కోర్టు వెలువరించిన తీర్పుపై మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ స్పందించారు.
ఉరిశిక్షను సమర్థించనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసు ఒప్పుకోవడం లేదన్నారు.
పోలీసులకు మరణశిక్ష
సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పును కమల్ హాసన్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. అయితే, తన వ్యక్తిగత సిద్ధాంతం ప్రకారం ఉరిశిక్షను తాను సమర్థించనని కమల్ స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
విజయం దక్కిందని
ఈ తీర్పుపై కమల్ స్పందిస్తూ, "జయరాజ్, బెన్నిక్స్ అనుభవించిన నరకం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ప్రజలను రక్షించాల్సిన వారే కాలయముళ్లుగా మారడం అత్యంత దారుణం. బాధితుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు ఈ న్యాయ పోరాటంలో విజయం దక్కింది.
మనసు ఒప్పుకోవడం లేదు
''వ్యక్తిగతంగా నేను మరణశిక్షకు వ్యతిరేకిని. అందుకే మనసు ఒప్పుకోవడం లేదు. ఎంతటి ఘోరమైన నేరానికి పాల్పడినా సరే వాళ్లకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించాలి. వారు చేసిన తప్పుకు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదనను చూస్తుంటే బాధగా ఉంది. ఆ పోలీసుల అమానవీయ చర్యల వల్ల ఎలాంటి పాపం తెలియని వారి భార్యాపిల్లలు బలికావాల్సి వస్తోంది" అని కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లను వదలొద్దు
కేవలం పోలీసులపైనే కాకుండా, ఈ కేసులో నిజాలను దాచిపెట్టిన ఇతరులపై కూడా కమల్ నిప్పులు చెరిగారు. "పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని కనీసం పరీక్షించకుండానే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్, రిమాండ్ విధించిన అధికారులు, కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వారు, అలాగే వారు శ్వాస తీసుకోలేక చనిపోయారని నిర్లక్ష్యంగా మాట్లాడిన అప్పటి అధికార పార్టీ నేతలకు కూడా శిక్ష పడాలి" అని కమల్ డిమాండ్ చేశారు.
ఏమిటీ సాత్తాంకుళం కేసు
కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 2020 జూన్ నెలలో సాత్తాంకుళం పోలీసులు పి. జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై అమానవీయంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కొద్దిరోజుల వ్యవధిలో మరణించారు.
ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ప్రజల ఆగ్రహం చూసి అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుదీర్ఘ విచారణ అనంతరం, ప్రత్యేక కోర్టు ఇప్పుడు తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Chandu Shanigarapu

