Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుసుమ్‌గర్ ఐపీఓ ప్రారంభం: 40% లిస్టింగ్ లాభాల సూచన.. అప్లై చేయాలా?

కుసుమ్‌గర్ ఐపీఓ ప్రారంభం: 40% లిస్టింగ్ లాభాల సూచన.. అప్లై చేయాలా?

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ తయారీ రంగంలో ఉన్న కుసుమ్‌గర్ (Kusumgar) పబ్లిక్ ఇష్యూ బుధవారం (జూలై 8) పెట్టుబడిదారుల ముందుకు వచ్చింది.

ఈ ఐపీఓ జూలై 10 (శుక్రవారం) వరకు ముగియనుంది. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లకు గట్టి డిమాండ్ కనిపిస్తుండటంతో మొదటి రోజే మార్కెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 193.9 కోట్లు

ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సంస్థ రూ. 193.9 కోట్లను సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ. 419 చొప్పున మొత్తం 46,28,877 ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఈ యాంకర్ బుక్‌లో బ్లాక్‌రాక్ గ్లోబల్ ఫండ్స్ (India Fund), గోల్డ్‌మన్ శాక్స్ ఫండ్స్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ సంస్థలు భాగస్వామ్యం పంచుకున్నాయి.

లాట్ సైజ్, కేటాయింపుల వివరాలు

ఈ ఐపీఓలో కనీసం 35 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ లేదా ఆపై 35 గుణకాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు (QIB) 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ ఉద్యోగుల కోసం రూ. 3.5 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. వీరికి తుది ఇష్యూ ధరపై రూ. 39 డిస్కౌంట్ లభిస్తుంది.

గ్రే మార్కెట్‌లో కుసుమ్‌గర్ హవా

ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 168 ప్లస్‌గా కొనసాగుతోంది. ఇష్యూ ధర రూ. 419తో పోలిస్తే, ఈ షేరు దాదాపు 40.10 శాతం ప్రీమియంతో రూ. 587 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడు సెషన్లుగా జీఎంపీ నిలకడగా పెరుగుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం కనీస జీఎంపీ రూ. 135 కాగా, గరిష్టంగా రూ. 171 వరకు పలికే అవకాశం ఉంది.

ఆర్థిక గణాంకాలపై విశ్లేషకుల ఆందోళన

ఈ ఐపీఓపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్' కీలక విశ్లేషణ చేసింది. రక్షణ రంగం (Defence Sector) నుంచి వస్తున్న ఆర్డర్ల వల్ల ఈ సంస్థకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, కంపెనీ ఆర్థిక గణాంకాలు గత కొన్నేళ్లుగా బలహీనపడటాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ఆదాయం, ఈపీఎస్ (EPS), నెట్ వర్త్ రిటర్న్ (RoNW) తగ్గుతూ వస్తున్నాయి. కంపెనీ నెట్ వర్త్ రిటర్న్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 86.13 శాతంగా ఉండగా, అది 2025లో 56.26 శాతానికి, ఆ తర్వాత 2026లో 25.82 శాతానికి పడిపోయింది.

"రక్షణ రంగం నుంచి వస్తున్న సానుకూల పరిణామాల వల్ల ఈ సంస్థకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ గత కొన్నేళ్లుగా కంపెనీ ఆర్థిక గణాంకాలు బలహీనపడటం ఆందోళనకరం" అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ అభిప్రాయపడింది.

2025 ఆర్థిక సంవత్సరంలో సీఎఫ్‌ఎఫ్ (CFF) పారాచూట్ల కోసం వచ్చిన ఒకే ఒక్క పెద్ద ఆర్డర్ వల్లే ఆ ఏడాది కంపెనీ లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని, అది నిరంతర వృద్ధి కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

పూర్తిగా ప్రమోటర్ల వాటాల విక్రయమే (100% OFS)

ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో వస్తోంది. ప్రమోటర్లయిన సిద్ధార్థ్ యోగేష్ కుసుమ్‌గర్, సప్నా సిద్ధార్థ్ కుసుమ్‌గర్, సిద్ధార్థ్ యోగేష్ కుసుమ్‌గర్ హెచ్‌యూఎఫ్ (HUF) తమ వాటాలను విక్రయిస్తున్నారు. దీనివల్ల వచ్చే నిధులు పూర్తిగా విక్రయించే వాటాదారులకే వెళ్తాయి తప్ప కంపెనీకి ఎలాంటి కొత్త మూలధనం రాదు. ఈ ఐపీఓకి యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.

నిపుణుల సలహా: అప్లై చేయాలా? వద్దా?

దీర్ఘకాలిక పెట్టుబడుల పరంగా ఈ కంపెనీపై కొంత జాగ్రత్త వహించడం మంచిదని బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, కేవలం లిస్టింగ్ లాభాల (Listing Gains) కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కీలక తేదీలు:

ఐపీఓ ముగింపు తేదీ: జూలై 10

షేర్ల కేటాయింపు (Allotment): జూలై 13

రీఫండ్‌లు, డీమ్యాట్ ఖాతాలోకి షేర్ల క్రెడిట్: జూలై 14

స్టాక్ మార్కెట్ లిస్టింగ్: జూలై 15

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu