Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లాభాల బుల్.. నష్టాల బేర్: స్టాక్ మార్కెట్ ఊగిసలాట వెనుక అసలు నిజాలివే

లాభాల బుల్.. నష్టాల బేర్: స్టాక్ మార్కెట్ ఊగిసలాట వెనుక అసలు నిజాలివే

స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒకే సరళరేఖలో ముందుకు సాగదు. షేర్ల ధరలు నిరంతరం పెరిగే సమయం ఉన్నట్లే, ఆ తర్వాత సర్దుబాట్లు (కరెక్షన్లు), లేదా పతనాలు రావడం చాలా సహజం.

మార్కెట్ ఒడుదొడుకులను చూసి భయాందోళన చెందకుండా లేదా మితిమీరిన ఉత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, ఈ వివిధ మార్కెట్ దశలపై ప్రతి పెట్టుబడిదారుడికి స్పష్టమైన అవగాహన ఉండాలి.

బుల్ మార్కెట్: ఆశావాదం ఉత్సాహాన్నిస్తుంది.. కానీ క్రమశిక్షణ ముఖ్యం

దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను సాధించడం, మార్కెట్లో తగినంత నగదు లభ్యత ఉండటం వల్ల షేర్ల ధరలు నిరంతరం పెరుగుతూ ఉండే కాలాన్ని 'బుల్ మార్కెట్' అంటారు. ఈ సమయంలో పెట్టుబడిదారుల్లో ఆశావాదం పెరుగుతుంది. ధరలు పెరిగేకొద్దీ వారి నమ్మకం మరింత బలపడి, కొత్త పెట్టుబడులు మార్కెట్లోకి వస్తాయి.

అయితే, నిరంతరం పెరిగే మార్కెట్ కొన్ని ప్రమాదాలనూ మోసుకొస్తుంది. మంచి రాబడులు చూసి పెట్టుబడిదారులు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి లోనయ్యే అవకాశం ఉంది. షేర్ల అసలు విలువను (Valuations) మరియు సొంత ఆర్థిక లక్ష్యాలను పట్టించుకోకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే బుల్ మార్కెట్లో లాభాలు పొందడంతో పాటు కఠినమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం.

బేర్ మార్కెట్ అంటే పతనమేనా?

మార్కెట్లో సుదీర్ఘ కాలం పాటు ధరలు తగ్గుతూ, పెట్టుబడిదారులలో అనిశ్చితి నెలకొనే దశను 'బేర్ మార్కెట్' అంటారు. సాధారణంగా ఒక మార్కెట్ ఇటీవల నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పతనమైతే దానిని బేర్ మార్కెట్‌గా భావిస్తారు. అయితే కేవలం ఒక సంఖ్యను బట్టే మార్కెట్ పరిస్థితిని అంచనా వేయలేము.

ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం, కేంద్రీయ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం లేదా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బేర్ మార్కెట్ ఏర్పడుతుంది. ఈ అనిశ్చితి కారణముగా పెట్టుబడిదారులు తమ నష్టాలను తగ్గించుకోవడానికి షేర్లను విక్రయిస్తారు, దాంతో ధరలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కానీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బేర్ మార్కెట్ అనేది వ్యూహాత్మక వైఫల్యం కాదు. మార్కెట్ చక్రంలో పతనాలు కూడా ఒక భాగమేనని ఇది గుర్తుచేస్తుంది.

కరెక్షన్‌ను బేర్ మార్కెట్‌గా భావించవద్దు

పెట్టుబడిదారులు ఎక్కువగా పొరబడే అంశం 'మార్కెట్ కరెక్షన్', 'బేర్ మార్కెట్' మధ్య ఉన్న వ్యత్యాసమే. కరెక్షన్ అనేది గరిష్ఠ స్థాయిల నుంచి తాత్కాలికంగా జరిగే స్వల్ప పతనం. సుదీర్ఘమైన బుల్ ట్రెండ్‌లో కూడా కరెక్షన్లు రావడం సహజం.

వేగంగా పెరిగిన ధరల వద్ద లాభాలను స్వీకరించడం (Profit Booking), లేదా కొత్త సమాచారం ఆధారంగా అంచనాలు మారినప్పుడు మార్కెట్ కొంత మేర తగ్గుతుంది. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే తప్ప సుదీర్ఘ పతనానికి సంకేతం కాదు. ప్రతి చిన్న పతనాన్ని బేర్ మార్కెట్ ప్రారంభంగా భావించి తొందరపడి మంచి షేర్లను విక్రయించడం పెట్టుబడిదారులు చేసే పెద్ద పొరపాటు.

సూచీలను దాటి ఆలోచించండి

మార్కెట్ ట్రెండ్‌ను కేవలం బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలను చూసి మాత్రమే అంచనా వేయలేము. ప్రధాన సూచీలు పెరుగుతున్నప్పటికీ కొన్ని రంగాలు లేదా నిర్దిష్ట కంపెనీల షేర్లు తగ్గుతుండవచ్చు. అలాగే విపణి బలహీనంగా ఉన్న సమయంలోనూ కొన్ని కంపెనీలు అద్భుత ప్రదర్శన కనబరుస్తాయి.

పెట్టుబడిదారుడికి నిజంగా కావలసింది మార్కెట్ బుల్లిష్‌గా ఉందా లేదా బేరిష్‌గా ఉందా అని కాక, తన పోర్ట్‌ఫోలియో తన ఆర్థిక లక్ష్యాలకు, జోక్య సామర్థ్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించుకోవడమే.

ప్రతి మార్కెట్ చక్రంలో క్రమశిక్షణే శ్రీరామరక్ష

బుల్ మార్కెట్ సమయంలో అత్యాశకు పోకుండా ఉండటం, బేర్ మార్కెట్ వేళ ఓపికగా వేచి ఉండటం, కరెక్షన్ల సమయంలో భయపడకుండా ఉండటమే నిజమైన పెట్టుబడిదారుడి లక్షణం. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ (వివిధ రంగాల్లో పెట్టుబడులు విస్తరించడం), సరైన అసెట్ అలోకేషన్, క్రమానుగత సమీక్షల ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవచ్చు. మార్కెట్ గరిష్ఠ, కనిష్ఠాలను ముందే అంచనా వేయడానికి ప్రయత్నించడం కంటే, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానమే మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది.

మనోభావాలకు తావివ్వకుండా, సొంత ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ దీర్ఘకాలిక ప్రయాణం సాగించడమే మార్కెట్ విజయానికి అసలైన సూత్రం.

వ్యాసకర్త:

శ్రీకాంత్ చౌహాన్,

హెడ్ - ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్

HT Telugu Desk

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu