Dailyhunt
Latheesh: ఉప్పు దొంగతనం చేసి తిన్న రోజులున్నాయి, నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు: తిమ్మరాజుపల్లి టీవీ విలన్ లతీష్

Latheesh: ఉప్పు దొంగతనం చేసి తిన్న రోజులున్నాయి, నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు: తిమ్మరాజుపల్లి టీవీ విలన్ లతీష్

Thimmarajupalli TV Villain Latheesh About His Career Struggles: తెలుగులో రూరల్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే.

ఈ మూవీతో నిర్మాతగా మారిన హీరో కిరణ్ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.

దక్కిన మొదటి విజయంపై లతీష్

ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్ మంచి పేరుని సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ విలన్ పాత్ర చేసిన లతీష్ చెప్పిన విశేషాలపై లుక్కేద్దాం.

మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి. మమ్మల్ని మా అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ కూడా అండగా నిలబడిన వారిలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు ముందుంటారు.

మీ సినిమా ప్రయాణం గురించి చెప్పండి?

బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని చెప్పారు. కానీ, ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ గారి వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను.

ఈ జర్నీలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?

షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్‌లోనూ మెంబర్‌షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ గారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.

బీ స్టూడియోలో మీ జర్నీ గురించి చెప్పండి?

బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ కోసం లక్ష రూపాయలు అడిగారు. డబ్బులున్న వాళ్లకేనా ఈ యాక్టింగ్ అని నేను ధీనంగా అడిగాను. వెంటనే నా దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా నా కమిట్‌మెంట్‌ని చూసి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడే నేను పదుల సంఖ్యలో నాటకాలు వేశాను. ఆ నాటకాలు వేస్తున్నప్పుడే 'తిమ్మరాజు పల్లి టీవీ' అసోసియేట్ డైరెక్టర్స్ చూశారు. అక్కడే మా అందరినీ చూసి ఆడిషన్స్ తీసుకున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu