Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin) ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ విజువల్స్‌కు టాలీవుడ్ అగ్ర హీరోలు ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇండస్ట్రీకి చెందిన పెద్ద స్టార్లందరూ అఖిల్ కొత్త మేకోవర్‌ను కొనియాడటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
అఖిల్ నటనకు మహేష్ బాబు ఫిదా
"లెనిన్ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలో అఖిల్ అద్భుతమైన నటనను, తీవ్రతను ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. జూలై 10న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు. అఖిల్ కష్టపడే తత్వానికి, స్క్రీన్ పై ఆయన చూపించిన ఎనర్జీకి మహేష్ అభినందనలు తెలపడం విశేషం.
ఎక్స్‌ప్లోజివ్ అన్న రామ్ చరణ్
ట్రైలర్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పట్ల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. "లెనిన్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు అఖిల్ ఈ రోల్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా, ఎక్స్‌ప్లోజివ్‌గా కనిపిస్తున్నారు. అఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
థియేటర్లలో విన్నర్
నేచురల్ స్టార్ నాని సైతం లెనిన్ ట్రైలర్ ను పొడిగేశారు. "ప్రియమైన అఖిల్‌కు లెనిన్ సినిమాతో భారీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కోసం పడిన కష్టం, శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేతుల్లో జూలై 10న ఒక పెద్ద హిట్ సినిమా ఉండబోతోందని నేను నమ్ముతున్నాను" అని నాని పేర్కొన్నారు.
రాయలసీమ నేపథ్యంలో
రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా 'లెనిన్' చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. 'ఏజెంట్' సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ఒక్క రోజులోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
మనం ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా శివాజీ, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట జూన్ 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, మరింత మెరుగైన ఔట్‌పుట్ కోసం చిత్రబృందం జూలై 10ని కొత్త విడుదల తేదీగా ప్రకటించింది.
Chandu Shanigarapu

