Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోన్ కట్టకపోతే ఎల్ఐసీ పాలసీ రద్దు చేయొచ్చు: వినియోగదారుల కమిషన్ తీర్పు

లోన్ కట్టకపోతే ఎల్ఐసీ పాలసీ రద్దు చేయొచ్చు: వినియోగదారుల కమిషన్ తీర్పు

బ్యాంకు రుణాలు తీసుకునేందుకు చాలామంది ఎల్ఐసీ లేదా ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ష్యూరిటీగా పెడుతుంటారు. అయితే, అప్పు తీర్చకపోతే ఆ పాలసీకి ఏమవుతుందనే దానిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) కీలక స్పష్టత ఇచ్చింది.

బ్యాంకుకు హామీగా అప్పగించిన (అసైన్ చేసిన) పాలసీని రద్దు చేసేందుకు అసలు పాలసీదారుడి నుంచి ప్రత్యేక అనుమతి గానీ, నోటీసు గానీ అవసరం లేదని ఎన్‌సీడీఆర్‌సీ తీర్పు చెప్పింది.

అసలు కేసేంటి?

హర్యానాలోని సోనెపత్ జిల్లా ఖార్ఖోడాకు చెందిన అమర్ సింగ్ 2001 డిసెంబర్ 28న ఎల్ఐసీ నుంచి రూ. 5 లక్షల బీమా హామీ మొత్తంతో (సమ్ అస్యూర్డ్) ఒక పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీ మెచ్యూరిటీ గడువు 2026 డిసెంబర్ 8 వరకు ఉంది. ఆ తర్వాత ఆయన ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 79,000 క్రెడిట్ లిమిట్ పొందడానికి తన ఎల్ఐసీ పాలసీని బ్యాంకుకు హామీగా (అసైన్) ఇచ్చారు.

అమర్ సింగ్ ప్రీమియంలు చెల్లిస్తున్నప్పటికీ, 2011 అక్టోబర్ 5న ఎల్ఐసీ ఈ పాలసీని రూ. 2,26,325కు సరెండర్ చేసి, ఆ మొత్తాన్ని ఐడీబీఐ బ్యాంకుకు బదిలీ చేసింది. తాను ఎలాంటి అనుమతి ఇవ్వకుండానే పాలసీని రద్దు చేశారని అమర్ సింగ్ సోనెపత్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

జిల్లా, రాష్ట్ర కమిషన్ల భిన్న తీర్పులు

ఈ కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం 2015 ఫిబ్రవరిలో అమర్ సింగ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాలసీని పునరుద్ధరించాలని ఎల్ఐసీని, సరెండర్ చేసిన రూ. 2,26,325 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో పాటు మానసిక వేదనకు రూ. 10,000 పరిహారం చెల్లించాలని ఐడీబీఐ బ్యాంకును ఆదేశించింది.

అయితే, ఈ తీర్పును ఎల్ఐసీ హర్యానా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో సవాలు చేసింది. 2016 సెప్టెంబర్‌లో రాష్ట్ర కమిషన్ విచారణ జరిపి, జిల్లా ఫోరం తీర్పును కొట్టివేసింది. పాలసీని బ్యాంకుకు అసైన్ చేసిన తర్వాత దానిపై హక్కులు బ్యాంకుకే ఉంటాయని, అమర్ సింగ్‌కు ప్రత్యేకంగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఎల్ఐసీకి లేదని స్పష్టం చేసింది. దీంతో అమర్ సింగ్ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు.

ఎన్‌సీడీఆర్‌సీ ఏం చెప్పిందంటే..

విచారణ సందర్భంగా, అమర్ సింగ్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. నిలిచిపోయిన పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తుందని, పాలసీ కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని 2011 నవంబర్‌లో బ్యాంకు లేఖ రాసినా ఎల్ఐసీ దాన్ని పునరుద్ధరించలేదని తెలిపారు.

దీనికి ఎల్ఐసీ స్పందిస్తూ.. ఇది ప్రీమియం చెల్లించకపోవడం వల్ల లాప్స్ అయిన పాలసీ కాదని వివరించింది. 2007 డిసెంబర్ 6న అమర్ సింగ్ పాలసీ హక్కులన్నింటినీ బ్యాంకుకు బదిలీ చేస్తూ సంతకం చేశారని, చట్టబద్ధమైన హక్కుదారు (అసైన్నీ) కోరిక మేరకే పాలసీని సరెండర్ చేశామని పేర్కొంది.

ఈ వాదనలను పరిశీలించిన ఎన్‌సీడీఆర్‌సీ 2026 ఆగస్టు 2న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. "ఫిర్యాదుదారుడు తన పాలసీని బ్యాంకుకు అసైన్ చేసిన మాట వాస్తవం. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు విజ్ఞప్తి మేరకు ఎల్ఐసీ సరెండర్ విలువను లెక్కించి ఆ మొత్తాన్ని బ్యాంకుకు పంపింది. నిబంధనల ప్రకారమే నడుచుకున్నందున ఈ వ్యవహారంలో బీమా సంస్థ సేవల్లో ఎలాంటి లోపం లేదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆ రూ. 2.26 లక్షల సంగతేంటి?

బాధితుడికి రావాల్సిన సరెండర్ విలువ రూ. 2,26,325 విషయమై ఐడీబీఐ బ్యాంకుకు ఎన్‌సీడీఆర్‌సీ కీలక ఆదేశాలిచ్చింది. అమర్ సింగ్ చెక్కును నగదుగా మార్చుకోకముందే ఖాతాను మూసివేయడంతో ఆ మొత్తం బ్యాంకు 'సస్పెన్స్ అకౌంట్'లో ఉండిపోయింది. నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అమర్ సింగ్‌కు విడుదల చేయాలని బ్యాంకును ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఏడాదికి 6 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పాలసీదారులు తెలుసుకోవాల్సిన విషయాలు

బ్యాంకు రుణాల కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కుదువ పెట్టేటప్పుడు అమల్లోకి వచ్చే 'అసైన్‌మెంట్' నిబంధనల తీవ్రతను ఈ తీర్పు తేటతెల్లం చేస్తోంది. పాలసీని బ్యాంకుకు బదిలీ చేసిన క్షణం నుంచి దానిపై పూర్తి హక్కులు బ్యాంకుకే సంక్రమిస్తాయి. కాబట్టి రుణాలు సరిగా చెల్లించని పక్షంలో పాలసీదారుడి ప్రమేయం లేకుండానే బ్యాంకు దాన్ని సరెండర్ చేసే అధికారం పొందుతుంది. అందుకే సెక్యూరిటీగా పాలసీలను ఇచ్చే ముందు ఈ నిబంధనలను కూలంకషంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu