Dailyhunt
Mammootty on Patriot: అందరూ ఎంజాయ్ చేయాలనే సినిమాలు తీస్తాం.. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి: పేట్రియాట్‌పై మెగాస్టార్

Mammootty on Patriot: అందరూ ఎంజాయ్ చేయాలనే సినిమాలు తీస్తాం.. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి: పేట్రియాట్‌పై మెగాస్టార్

Mammootty on Patriot: మలయాళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ సుమారు 13 ఏళ్ల తర్వాత కలిసి నటించిన స్పై థ్రిల్లర్ 'పేట్రియాట్' (Patriot).

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై నెట్టింట మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో మెగాస్టార్ మమ్ముట్టి తొలిసారిగా స్పందించారు.

"ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది"

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పేట్రియాట్' సినిమాపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ అంటుంటే, మరికొందరు ఇంతటి భారీ స్టార్ కాస్ట్‌ను సరిగ్గా వాడుకోలేదని పెదవి విరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మమ్ముట్టి మాట్లాడుతూ.. "మనం ప్రస్తుతం ప్రైవసీ కనుమరుగవుతున్న కాలంలో ఉన్నాం. ఆ అంశాన్నే మా సినిమా చర్చిస్తుంది" అని పేర్కొన్నారు.

నెగటివ్ రివ్యూల గురించి స్పందిస్తూ.. "ఒక సినిమాపై రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే మీరు కూడా కొన్ని రివ్యూలు విని ఉండొచ్చు. అయితే బయట ఎవరు ఏం చెప్పినా, మీరు సినిమా చూశాక ఏర్పరుచుకునే మీ సొంత అభిప్రాయమే నాకు ముఖ్యం. అందరూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము సినిమాలు తీస్తాం" అని హుందాగా సమాధానమిచ్చారు.

13 ఏళ్ల నిరీక్షణ.. 'పేట్రియాట్' కథేంటంటే?

2013లో వచ్చిన 'కడల్ కడన్ను ఒరు మాత్తుకుట్టి' తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన సినిమా ఇదే కావడంతో దీనిపై కేరళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంలో మమ్ముట్టి ఒక రిటైర్డ్ జేఏజీ (JAG) ఆఫీసర్‌గా నటించారు.

దేశద్రోహం కేసులో అన్యాయంగా ఇరుక్కున్న ఆయన.. తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నారనేది ప్రధానాంశం. ఈ మిషన్‌లో ఆయనకు అండగా నిలిచే ఆర్మీ ఆఫీసర్‌గా మోహన్‌లాల్ కనిపిస్తారు. ఇక వీరిద్దరి కలయికను అడ్డుకోవాలని చూసే పవర్‌ఫుల్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటించగా, నయనతార కీలక పాత్ర పోషించారు.

పాన్-ఇండియా కాదు.. మలయాళీ సొంత సినిమా

సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో మమ్ముట్టి ఒక ఆసక్తికర విషయం చెప్పారు. "ఈ సినిమాను ప్రధానంగా మలయాళీ ప్రేక్షకుల కోసమే తీశాం. ఇది పాన్-ఇండియా సినిమా కాదు. కానీ కేరళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో సరికొత్త ప్రమాణాలతో రూపొందించాం. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో మరిన్ని భారీ చిత్రాలకు దారి చూపుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అభిమానులకు 'పేట్రియాట్' మిశ్రమ ఫలితాన్ని ఇవ్వడం కొంత నిరాశ కలిగించినా, మమ్ముట్టి, మోహన్ లాల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం మాత్రం కనువిందుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పేట్రియాట్' సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్ ఏ పాత్రల్లో నటించారు?

మమ్ముట్టి ఒక రిటైర్డ్ జేఏజీ ఆఫీసర్‌గా, మోహన్‌లాల్ ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. దేశాన్ని కాపాడే ఒక సీక్రెట్ మిషన్‌లో వీరిద్దరూ కలిసి పనిచేస్తారు.

2. మమ్ముట్టి, మోహన్‌లాల్ ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసి నటించారు?

సుమారు 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వీరిద్దరూ కలిసి 'పేట్రియాట్' చిత్రంలో నటించారు.

3. పేట్రియాట్ సినిమాకు వస్తున్న స్పందన ఏమిటి?

ప్రస్తుతానికి ఈ సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన (Mixed Reviews) లభిస్తోంది. మేకింగ్ బాగున్నా, కథనం విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

4. 'పేట్రియాట్' చిత్రానికి దర్శకుడు ఎవరు?

మలయాళ స్టార్ డైరెక్టర్ మహేష్ నారాయణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu