Dailyhunt
MMTS Stations Hyderabad : నగరంలో మరో 3 కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు.! ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే.?

MMTS Stations Hyderabad : నగరంలో మరో 3 కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు.! ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే.?

MMTS Stations Hyderabad :హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత చౌకైన, వేగవంతమైన రవాణా మార్గమైన ఎంఎంటీఎస్ (MMTS) సేవలు మరింత విస్తరించబోతున్నాయి.

నగరంలోని ప్రధాన శివారు ప్రాంతాల నుంచి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని…. మరో మూడు కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే…?

అల్వాల్‌లోని లయోలా కళాశాల సమీపంతో పాటు ఆనంద్‌బాగ్‌, మౌలాలీ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తుది నివేదికను రైల్వే బోర్డు ఆమోదానికి పంపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  • ఘట్‌కేసర్‌-సనత్‌నగర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో కొత్త స్టేషన్ల అవసరం పెరిగింది. వాస్తవానికి పదేళ్ల క్రితమే ఈ సెక్షన్‌లో కొన్ని స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. అల్వాల్ లయోలా కాలేజీ పరిసరాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. ప్రయాణికుల సంఘాల విజ్ఞప్తి మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ స్వయంగా లెవెల్ క్రాసింగ్‌లను సందర్శించి…. నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఇక్కడ స్టేషన్ ఏర్పాటైతే అల్వాల్, బొల్లారం ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుంది.
  • సబర్బన్ రైల్వే నిబంధనల ప్రకారం కనీసం ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక రైల్వేస్టేషన్‌ ఉండాలి. కానీ….. చర్లపల్లి నుంచి నేరేడ్‌మెట్‌ వరకు సుదీర్ఘ మార్గంలో ఒక్క స్టేషన్‌ కూడా లేదు. దీంతో మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్ వాసులు నిజామాబాద్‌ లేదా చర్లపల్లి మార్గంలో వెళ్లే రైళ్లు ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరేడ్‌మెట్‌ లేదా చర్లపల్లి స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్‌ నిర్మిస్తే ఈ ప్రాంత వాసుల ప్రయాణ అవస్థలు శాశ్వతంగా తప్పనున్నాయి.
  • మౌలాలీలోని రైల్వే క్వార్టర్స్‌ సమీపంలో సుమారు 2 వేల నివాసాలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టుపక్కల కాలనీల జనాభా కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి వారు ఎంఎంటీఎస్ సేవలు పొందాలంటే దూరంగా ఉన్న స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. క్వార్టర్స్ సమీపంలోనే ఒక హాల్ట్ లేదా స్టేషన్ నిర్మిస్తే, స్థానికులు నేరుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.

ఈ మూడు స్టేషన్ల నిర్మాణంతో ఎంఎంటీఎస్ రెండో దశ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి…. పనులను వేగవంతం చేసే అవకాశాలుంటాయి.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu