Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nani supports Pawan Kalyan : ఊరూరా 'స్వచ్ఛ రథాల' విప్లవం - పవన్ కళ్యాణ్ ఆలోచనకు హీరో నాని మద్దతు..!

Nani supports Pawan Kalyan : ఊరూరా 'స్వచ్ఛ రథాల' విప్లవం - పవన్ కళ్యాణ్ ఆలోచనకు హీరో నాని మద్దతు..!

Pawan Kalyan Swachha Ratham : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా మారింది. "మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం..

మన బాధ్యత" అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న 'స్వచ్ఛ రథాలు' పల్లెల్లో చెత్తను సంపదగా మారుస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

గత ఏప్రిల్ నెలలో ఈ స్వచ్ఛ రథాలు సాధించిన ప్రగతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల నుంచి రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్తను ఈ రథాలు సేకరించాయి. కేవలం సేకరించడమే కాకుండా, 'చెత్త నుంచి సంపద' సృష్టి అనే యజ్ఞంలో భాగంగా ఆ వ్యర్థాలకు బదులుగా రూ. 3.32 కోట్ల విలువైన నిత్యవసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేశారు. అంటే…. ఒకప్పుడు పనికిరాదని పారేసిన వస్తువులే నేడు గ్రామీణ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి.

'నేచురల్ స్టార్' నాని మద్దతు…

ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు టాలీవుడ్ ప్రముఖ నటుడు నాని తన వంతు సహకారాన్ని అందించారు. పారిశుధ్యంపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములయ్యారు.

తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయమని చెప్పడమే కాకుండా, అలా చేసిన వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం గొప్ప ఆలోచన అని నాని అభిప్రాయపడ్డారు. "పర్యావరణం కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ కృషికి అభినందనలు. మీకు మద్దతుగా నిలిచే కోట్లాది మందిలో నేను కూడా ఒకడిని" అంటూ నాని తన అభిమానాన్ని చాటుకున్నారు.

నానికి కృతజ్ఞతలు - డిప్యూటీ సీఎం పవన్

"గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథాలను తీసుకువచ్చింది. వీటి గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన నానికి పవన్ కళ్యాణ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అంటూ ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

భవిష్యత్తు తరాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ పథకంలో ఒక వినూత్న కోణాన్ని చేర్చారు. ప్రతి గురువారం ఈ స్వచ్ఛ రథాలు నేరుగా పాఠశాలల వద్దకు వెళ్తాయి. విద్యార్థులు తమ ఇళ్ల నుంచి సేకరించిన పొడి చెత్తను అక్కడ అందజేస్తే, దానికి బదులుగా వారికి అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు వంటి స్టేషనరీ సామాగ్రిని అందిస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లల్లో వ్యర్థాల నిర్వహణపై చిన్నతనం నుంచే బాధ్యత పెరుగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' స్పూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 'స్వచ్ఛ ఆంధ్రా' లక్ష్యాలను చేరుకోవడమే ఈ స్వచ్ఛ రథాల ప్రధాన ఉద్దేశం. కేవలం రోడ్లను శుభ్రం చేయడమే కాకుండా, ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పు పల్లె ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా… ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేస్తోంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu