Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవ్విందుకు కన్నతండ్రినే చంపిన కొడుకు.. చిత్తూరు జిల్లాలో దారుణం

నవ్విందుకు కన్నతండ్రినే చంపిన కొడుకు.. చిత్తూరు జిల్లాలో దారుణం

ద్యం మత్తు, క్షణికావేశం కాపురాల్లో నిప్పులు పోయడమే కాదు.. కన్నబంధాలను సైతం ఎంత దారుణంగా బలితీసుకుంటాయో నిరూపించే హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

తనను చూసి నవ్వాడనే కారణంతో కన్నతండ్రి అని కూడా చూడకుండా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో కిరాతక కొడుకు. పెనుమూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోరం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్యరాయునిపల్లె గ్రామానికి చెందిన చెంగారెడ్డి (55)కి జోకేష్ రెడ్డి, హేమచంద్ర రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జోకేష్ రెడ్డి ఎల్లంపల్లె సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య చూడమణి పెనుమూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తోంది. వీరిద్దరూ పెనుమూరులోనే నివాసముంటున్నారు.

అయితే జోకేష్ రెడ్డికి మద్యం వ్యసనం ఉంది. ప్రతిరోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడటం, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం అలవాటుగా మార్చుకున్నాడు. బుధవారం రాత్రి కూడా పీకలదాకా తాగి ఇంటికి వచ్చిన జోకేష్ రెడ్డి, భార్య చూడమణితో తీవ్రస్థాయిలో గొడవకు దిగాడు.

భర్త వేధింపులు తాళలేకపోయిన చూడమణి వెంటనే తన మామ అయిన చెంగారెడ్డికి ఫోన్ చేసింది. 'మీ అబ్బాయి మళ్లీ తాగి వచ్చి మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. మీరు వెంటనే వచ్చి అతనికి బుద్ధి చెప్పి, మీతో పాటు తీసుకువెళ్లండి.' అని ఆవేదనతో చెప్పింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన జోకేష్ రెడ్డి, భార్య చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. తన తండ్రితో మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడే బైక్ వేసుకుని మాణిక్యరాయునిపల్లెకు వచ్చి నిన్ను కలుస్తాను.' అని చెప్పాడు.

చెప్పినట్లే జోకేష్ రెడ్డి బైక్‌పై మాణిక్యరాయునిపల్లెలోని తండ్రి వద్దకు చేరుకున్నాడు. అక్కడ తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రి చెంగారెడ్డి తన కొడుకు ప్రవర్తనను చూసి నవ్వాడు. మద్యం మత్తులో ఉన్న జోకేష్ రెడ్డికి, తండ్రి నవ్వడం తీవ్రమైన అవమానంగా, ఆగ్రహంగా అనిపించింది. ఆ క్షణికావేశంలో మానవత్వాన్ని మర్చిపోయిన కొడుకు పదునైన కత్తితో కన్నతండ్రి గొంతు కోసి హత్య చేశాడు. రక్తం మడుగులో తండ్రి పడిపోగానే అక్కడ నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు జోకేష్ రెడ్డి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Anand Sai, Chittoor

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu