Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal floods : ఆపదలోనూ సమయస్ఫూర్తి! నేపాల్​లో మృత్యువును జయించిన 8ఏళ్ల బాలుడి కథ..

Nepal floods : ఆపదలోనూ సమయస్ఫూర్తి! నేపాల్​లో మృత్యువును జయించిన 8ఏళ్ల బాలుడి కథ..

నేపాల్ ఉత్తర సరిహద్దుల్లో ఇటీవలే ప్రళయం విరుచుకుపడింది. కొండచరియలు, బురద ప్రవాహంలో ఊళ్లు, బడులు కళ్లముందే తుడిచిపెట్టుకుపోయాయి. అంతటి భయానక వాతావరణంలో అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే, ఆ ఎనిమిదేళ్ల పసివాడు ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.

ప్రవాహ హోరును చూసి సమయస్ఫూర్తితో అడవిలోకి పరుగెత్తి, ఎత్తైన చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని భారీ వరదకు చిక్కకుండా ప్రాణాలను కాపాడుకున్నాడు.

నేపాల్ జలప్రళయంలో చోటుచేసుకున్న ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు ప్రతీ ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తోంది!

బడికెళ్లిన పిల్లలు రాలేదు.. తల్లి కన్నీటి పర్యంతం

నేపాల్​లోని రసువా జిల్లాకు చెందిన మట్టి మాయ తమంగ్ (28) బుధవారం ఉదయం తన ఇద్దరు కొడుకులను స్కూల్ వ్యాన్‌లో బడికి పంపింది. ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పెద్ద శబ్దం వినపడింది. లాంగ్‌టాంగ్ లీరుంగ్ పర్వత ప్రాంతంలో గ్లేషియర్ ఉన్నపళంగా విరిగిపడటంతో కొండచరియలు, విపరీతమైన మట్టి నీరు వరదలా విరుచుకుపడ్డాయి. ఆ ఉద్ధృతికి పాఠశాల, చుట్టుపక్కల ఉన్న మార్కెట్, నివాసాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి.

"నా కళ్లముందే అంతా కొట్టుకుపోతోంది. నా పిల్లలు కూడా ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయారేమోనని నా గుండె ఆగిపోయినంత పనైంది," అని మట్టి మాయ ఆనాటి భయంకర దృశ్యాలను కన్నీళ్లతో గుర్తుచేసుకుంది. బడి ఉన్న ప్రాంతానికి వెళ్లి చూసేసరికి అక్కడ స్కూల్ లేదు! రాళ్లు, మట్టి, నీళ్లు తప్ప ఏమీ కనిపించలేదు.

విరిగిన కాలు.. అడవిలో పోరాటం

వరద విరుచుకుపడిన క్షణంలో ఎనిమిదేళ్ల జోయల్ ఘలే తెలివిగా వ్యవహరించాడు. భయంతో కేకలు వేయకుండా, సమీపంలోని దట్టమైన అడవి వైపు పరుగెత్తాడు. పెద్ద చెట్టుపైకి ఎక్కి కొమ్మలను గట్టిగా పట్టుకుని గంటల తరబడి అలాగే ఉండిపోయాడు. అలా రాకాసి వరద నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఆ క్రమంలో అతడి కాలు విరిగిపోయింది, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సహాయక బృందాలు అతడిని హెలికాప్టర్ ద్వారా నువాకోట్ జిల్లా ఆసుపత్రికి తరలించాయి.

జర్నలిస్ట్ చేసిన చిన్న సాయం.. పునర్జన్మ పొందిన కొడుకు!

సహాయక శిబిరాలు, ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కొడుకుల పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆ తల్లి ఆశలు వదులుకుంది. "నా బిడ్డలిద్దరూ ఇక లేరని అనుకున్నాను. నా కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు," అని మట్టి మాయ పేర్కొంది.

సరిగ్గా అదే సమయంలో ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ (రాయటర్స్) జర్నలిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోయల్‌ను కలిశారు. ఆ బాలుడి కుటుంబ సభ్యుల ఆచూకీ కనుక్కోవడానికి అతని అనుమతితో ఒక చిన్న వీడియో తీసి, తన ఫోన్ నంబర్‌ను ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మట్టి మాయ ఆ నంబర్‌కు ఫోన్ చేయగా, కొడుకు బ్రతికే ఉన్నాడని, మెరుగైన చికిత్స కోసం కాఠ్‌మాండ్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది. అదే సమయంలో ఆమె చిన్న కొడుకు కూడా సురక్షితంగా దొరకడంతో ఆ తల్లి ప్రాణం లేచొచ్చినట్లయింది.

శుక్రవారం కాఠ్‌మాండ్ ఆసుపత్రి బెడ్‌పై గాయాలతో పడుకున్న కొడుకును చూసి మట్టి మాయ భావోద్వేగానికి లోనైంది.

"వీడు ఎప్పుడూ తుంటరి వెధవే, కాలు విరగ్గొట్టుకోవడం వీడికిదేమీ మొదటిసారి కాదు," అని కన్నీళ్ల మధ్య నవ్వుతూ ఆ తల్లి అన్న మాటలు అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసాయి.

జపాన్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న జోయల్ తండ్రి కూడా కొడుకును చూసేందుకు ఆత్రుతగా బయలుదేరారు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu