నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) త్వరలో తన రోగ నిర్ధారణ, చికిత్స ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలను అనుసంధానించనుంది.
ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), తను (TANUH) ఫౌండేషన్‌తో నిమ్స్ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
నిమ్స్ అధికారులు సోమవారం నాడు ఐఐఎస్సీ (IISc) ఏఐ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ పరిష్కారాలు, మల్టీ-సెంటర్ అధ్యయనాలు చేపట్టనున్నారు. రోగి వ్యక్తిగత డేటా ఆధారంగా ఖచ్చితమైన చికిత్స అందించే 'ప్రెసిషన్ మెడిసిన్'పై ఈ పరిశోధనలు దృష్టి సారిస్తాయి.
ప్రయోగశాలలో ఆవిష్కరించిన ఏఐ పరికరాలను నేరుగా రోగి చికిత్సలో వాడేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు త్వరలోనే పూర్తి కానున్నాయి. రోగి సంరక్షణ కోసం ఏఐ సాధనాల ఉమ్మడి అభివృద్ధి, క్లినికల్ డేటా ఆధారిత పరిశోధన, ప్రెసిషన్ మెడిసిన్, అలాగే ఆవిష్కరణలను ల్యాబ్ నుండి పేషెంట్ బెడ్ వరకు తీసుకువెళ్లే ట్రాన్స్‌లేషనల్ ఏఐ అప్లికేషన్‌ల విషయంలో సహకరించాల్సిందిగా నిమ్స్‌ను ఆహ్వానించాయని ఒక పత్రికా ప్రకటన తెలిపింది.
రోగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే, వైద్యపరంగా వినియోగించగల ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నిమ్స్, TANUH ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.
ఏఐ టూల్స్ సెకన్ల వ్యవధిలో చిన్నపాటి అసాధారణతలను కూడా గుర్తించగలవు. ఇది ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఐఐఎస్సీ, TANUH ఫౌండేషన్ భారతీయుల జన్యుపరమైన, సామాజిక డేటాపై పరిశోధనలు చేస్తున్నాయి. విదేశీ సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడకుండా, మన దేశ రోగుల అవసరాలకు తగ్గట్టుగా ఏఐని మలచడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
నిమ్స్ వంటి సంస్థ ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.
Anand Sai, Hyderabad

