Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పరీక్ష రద్దు దారుణం: రీ-ఎగ్జామ్ భయంతో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పరీక్ష రద్దు దారుణం: రీ-ఎగ్జామ్ భయంతో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, ఆ తర్వాతి పరిణామాల వల్ల పరీక్ష రద్దవడం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పరీక్ష రద్దవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 20 ఏళ్ల నీట్ అభ్యర్థిని 14 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.

సదరు విద్యార్థిని రాసిన ఆత్మహత్య లేఖ తాజాగా లభించడంతో ఈ దారుణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఈ యువతి, తన తండ్రి నాగపూర్‌లో వంటమనిషిగా పనిచేస్తుండటంతో కుటుంబంతో సహా అక్కడే నివసిస్తూ నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె మరణానంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమె పుస్తకాలను సర్దుతుండగా ఒక నోట్‌బుక్‌లో ఆత్మహత్య లేఖ దొరికింది.

"నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్ష పెడితే, మొదటిలాగే బాగా రాస్తాననే గ్యారంటీ లేదు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నేను అంతా పాడుచేశాను" అని ఆ యువతి తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది.

వ్యవస్థ వైఫల్యంపై తండ్రి ఆవేదన

పరీక్ష రద్దు కావడం వల్లే ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, అయితే ఆత్మహత్యకు అదే కారణమని తాము ముందుగా ఊహించలేకపోయామని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, ఎలాగైనా డాక్టర్ కావాలనే బలమైన ఆశయంతో ఉన్న తన కుమార్తె కోసం అప్పులు చేసి మరీ చదివించానని ఆమె తండ్రి వాపోయారు.

"నా కుమార్తె ఎంతో తెలివైంది, ఎప్పుడూ డాక్టర్ అవ్వాలని కలలుగనేది. మా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఆమెను చదివించాం. పరీక్ష రాశాక ఎంపికవుతాననే నమ్మకంతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ పేపర్ లీక్, పరీక్ష రద్దు వార్తలు వినగానే పూర్తిగా కుంగిపోయింది. ప్రభుత్వం పరీక్షను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే నా 20 ఏళ్ల కష్టం వృథా అయిపోయింది" అని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థలోని లోపాల వల్ల తన కూతురిని కోల్పోయిన ఆ తండ్రి, ఇప్పుడు తన చిన్న కుమారుడి చదువును కూడా ఆపేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న అతడిని ఇలాంటి విఫలమైన విద్యా వ్యవస్థలో చదివించి మానసిక క్షోభకు గురిచేయడం కంటే, వ్యవసాయ పనుల్లో పెట్టడమే మేలని ఆయన తీవ్ర నిరాశతో వ్యాఖ్యానించారు.

అండగా ఉంటామన్న కాంగ్రెస్ నాయకులు

ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు యశ్ ఘంఘోరియా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదువు కోసం చేసిన అప్పులను తీర్చడంలో తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థ వైఫల్యం వల్లే ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu