గురుగ్రామ్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'రివోల్ట్ ఆర్‌వీఎక్స్' (Revolt RVX) ను ఆవిష్కరించింది.
ఈ సరికొత్త బైక్ ప్రారంభ ధరను రూ. 1.29 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, ప్రభుత్వ సబ్సిడీల తర్వాత దీనిని రూ. 1.24 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ బైక్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అక్కడ అమలులో ఉన్న ఈవీ పాలసీ సబ్సిడీ వర్తిస్తే కేవలం రూ. 95,000లకే (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఒకవేళ వినియోగదారులు తమ పాత పెట్రోల్ బైక్‌ను స్క్రాప్ (రద్దు) చేసి ఈ సరికొత్త ఈవీని కొనుగోలు చేస్తే, కేవలం రూ. 85,000లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం కాగా, జూలై చివరి వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
రివోల్ట్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఆర్‌వీ1, ఆర్‌వీ1+, ఆర్‌వీ బ్లేజ్‌ఎక్స్, ఆర్‌వీ400 బీఆర్‌జెడ్, ఆర్‌వీ400 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్లేజ్‌ఎక్స్ సాధారణ ప్రయాణాలకు అనువుగా ఉండే కమ్యూటర్ బైక్ కాగా, ఆర్‌వీ400 పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సరికొత్త ఫీచర్లతో ఆర్‌వీఎక్స్ వచ్చి చేరింది.
షార్క్ డిజైన్.. అదిరిపోయే ఫీచర్లు
సరికొత్త రివోల్ట్ ఆర్‌వీఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను షార్క్ (సొరచేప) శరీరాకృతి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ బ్లూ, పెర్ల్ బ్లాక్, ఎక్లిప్స్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. రైడర్ల సౌకర్యార్థం ఇందులో ఇన్‌స్టంట్ బూస్ట్ మోడ్, హిల్ హోల్డ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్లను జోడించారు.
కార్బన్ ఫైబర్ ప్యానెల్స్, పొడవైన సీటు, కనెక్టెడ్ టెక్నాలజీ ఈ బైక్ సొంతం. ఈ బైక్ 14 డిగ్రీల వాలు ఉన్న రోడ్లను కూడా సులభంగా ఎక్కగలదు (వెనుక ప్రయాణికుడు ఉంటే ఇది 11 డిగ్రీలకు మారుతుంది). అలాగే పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు విభిన్న శబ్దాలను ఉత్పత్తి చేసే సౌండ్ బాక్స్, ముందు-వెనుక ఎల్‌ఈడీ (LED) లైటింగ్‌ను అమర్చారు.
బ్యాటరీ సామర్థ్యం.. రేంజ్
సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో యూఎస్‌డీ (USD) ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ అబ్జార్బర్‌ను ఉపయోగించారు. రివోల్ట్ ఆర్‌వీఎక్స్‌లో 3.24 కిలోవాట్ అవర్ (kWh) పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
సాధారణ ఛార్జర్ ద్వారా 3 గంటల 30 నిమిషాల్లో బ్యాటరీ 0 నుండి 80 శాతానికి చేరుకుంటుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 80 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.
వారంటీ వివరాలు
ఈ బైక్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని ఇస్తోంది. వీటితో పాటు అదనపు భద్రత కోసం 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల పొడిగించిన (Extended) వారంటీ ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు అందిస్తోంది.
| Revolt RVX: Specifications in a nutshell | |
|---|---|
| Battery | 3.24 kWh portable |
| Range | Up to 160 km |
| Top speed | 90 kmph |
| Standard charging (0%-80%) | 3.30 hours |
| Fast charging (0%-80%) | 80 minutes |
| Suspension | USD fork (Front), Monoshock (Rear) |
| Brake | Discs (Front and rear) |
Praveen Kumar Lenkala

