Dailyhunt
On Site FIR : ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్.. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!

On Site FIR : ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్.. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!

పోలీసు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, తీవ్రమైన నేరాలను ఎదుర్కోవడానికి 'ఆన్-సైట్ ఎఫ్ఐఆర్' (ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సునీత రెడ్డి ప్రకటించారు.

ఎస్పీ ప్రకారం.. ఈ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ వల్ల పోలీసు అధికారులు సంఘటనా స్థలంలోనే లేదా బాధితులకు సౌకర్యవంతంగా ఉండే వారి నివాసం, ఆసుపత్రి లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్(FIR) నమోదు చేయవచ్చు. దీనివల్ల, ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితులలో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

హత్య, అత్యాచారం, దోపిడీ, దొంగతనం, కిడ్నాప్, మహిళలు, పిల్లలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ/ఎస్టీ సంబంధిత కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి తీవ్రమైన నేరాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సంఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వల్ల సాక్ష్యాలను వేగంగా సేకరించవచ్చని, నిందితులను వెంటనే పట్టుకునే అవకాశాలు మెరుగుపడతాయని ఎస్పీ సునీత రెడ్డి చెప్పారు.

కరీంనగ్ సీపీ సమీక్ష

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ మీద ఎస్పీలు సమీక్షలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు విధానం అమలు, అవగాహన, సమర్థవంతమైన నిర్వహణపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు.

'బాధితులకు సులభంగా న్యాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్-సైట్ ఎఫ్‌ఐఆర్ విధానం అత్యంత ముఖ్యమైంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇతర బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా వారి నివాసం లేదా సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా వేగవంతమైన న్యాయం సాధ్యమవుతుంది.' అని సీపీ గౌష్ అన్నారు. ఎఫ్ఐర్ కాపీని బాధితులకు అందించాలని కరీంనగర్ సీపీ అన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి అన్నారు.

ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అందజేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీసులు ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశానికే పోలీసులు వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందజేశారు. ఓ కేసు విషయంలో గూగులోత్ రాములు అనే మేకల కాపరి ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి.. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందజేశారు.

ప్రజలకు త్వరితగితన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు, పోలీస్ స్టేషన్ స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu