Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Telugu: ఓటీటీలోకి 20 రోజుల్లోనే తెలుగు కామెడీ డ్రామా.. ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

OTT Telugu: ఓటీటీలోకి 20 రోజుల్లోనే తెలుగు కామెడీ డ్రామా.. ముట్టుకుంటే షాక్ కొట్టే సుకుమారి.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

OTT Telugu: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ (Thiruveer), సంక్రాంతికి వస్తున్నాం భామ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన కామెడీ డ్రామా 'ఓ సుకుమారి' (Oh Sukumari) డిజిటల్ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది.

జులై 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది.

బిగ్ స్క్రీన్ పై అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఓ సుకుమారి మూవీ ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

థియేటర్లలో సరైన ప్రమోషన్లు లేకపోవడం, మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టడంలో ఈ సినిమా విఫలమైంది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు లభించే ఆదరణ చూసి ఓటీటీ ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

అసలు కథేంటంటే?

నరాల యాదగిరి (తిరువీర్) తన సొంత పల్లెటూరిలో సర్పంచ్ అవ్వాలని ఆశపడుతాడు. అతని తాత రాసిన విచిత్రమైన వీలునామా ప్రకారం.. యాదగిరికి లేదా అతని బాబాయ్ కొడుక్కి ఎవరికైనా సరే మొదట మగబిడ్డ పుడితేనే వారి కుటుంబానికి రూ.80 కోట్ల విలువైన ఆస్తి దక్కుతుంది. ఈ క్రమంలో ఒక పెళ్లి చూపుల దగ్గర దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి యాదగిరి మనసు పారేసుకుంటాడు. వెంటనే పెళ్లి ప్రపోజల్ పెడతాడు.

అయితే దామినికి ఒక వింత సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకిన వారికి కరెంట్ షాక్ కొడుతుంది. దామిని వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్న ఆ ఊరి జనాలు ఎవరికీ నిజం చెప్పకుండా, ఎలాగోలా యాదగిరితో పెళ్లి జరిపిస్తారు. పెళ్లయి శోభనం రాత్రి యాదగిరికి ఈ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత యాదగిరి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? సర్పంచ్ ఎలా అయ్యాడు? వారిద్దరూ ఎలా కలిసి జీవించారు? యాదగిరి తాత ఆస్తిని దక్కించుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

'మసూద' ఫేమ్ తిరువీర్ కాంబో.. ఎక్కడ మిస్ అయింది?

'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే తిరువీర్, ఈ సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక సరదా కుర్రాడి పాత్రలో కనిపించారు.

అలాగే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, నేచురల్ రోల్స్‌తో మెప్పించే ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. దర్శకుడు భరత్ దర్శన్ రాసుకున్న కథలో కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా లేకపోవడమే బాక్సాఫీస్ ఫ్లాప్‌కు కారణమని సినీ విమర్శకులు భావిస్తున్నారు.

సీనియర్ నటుల సందడి.. ఓటీటీలో కంబ్యాక్ ఇస్తుందా?

ఈ సినిమాలో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి లాంటి సీనియర్ నటీనటులు కీలకమైన పాత్రల్లో నటించి తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ మధ్య కాలంలో థియేటర్లలో ప్లాప్ అయిన చాలా సినిమాలు ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచాయి. అదే తరహాలో 'ఓ సుకుమారి' కూడా డిజిటల్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుని బిగ్ హిట్ కానుందో లేదో చూడాలి.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu