Dailyhunt
OTT Thriller: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక నటించిన లీగల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఇద్దరు మహిళల మధ్య ఫైట్

OTT Thriller: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక నటించిన లీగల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఇద్దరు మహిళల మధ్య ఫైట్

OTT Thriller: ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సౌత్ స్టార్ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హై-వోల్టేజ్ లీగల్ థ్రిల్లర్ 'సిస్టమ్' (System) విడుదలకు సిద్ధమైంది.

విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బావేజా స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

న్యాయం కోసం ఇద్దరు మహిళల పోరాటం

ఈ సిస్టమ్ సినిమా కథాంశం మొత్తం న్యాయస్థానం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా భిన్నమైన ప్రపంచాలకు చెందిన ఇద్దరు మొండి పట్టుదల గల మహిళల మధ్య జరిగే ఘర్షణను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాగా, మరొకరు కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తుంటారు.

వ్యవస్థలో ఉండే లోపాలు, అధికారం ఉన్నవారికే చట్టం చుట్టూ తిరిగే పరిస్థితుల మధ్య.. ఈ ఇద్దరు మహిళలు తమదైన రీతిలో న్యాయం కోసం ఎలా పోరాడారనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. నిజం కంటే అధికారానికే ప్రాముఖ్యత ఇచ్చే నేటి వ్యవస్థలో ఈ ఇద్దరు మహిళల ఆలోచనలు ఎలా విభేదించాయి.. చివరికి వారు అనుకున్నది సాధించారా లేదా అనేది ఆసక్తికరంగా మలిచారు.

సిస్టమ్ మూవీ విశేషాలు

సోనాక్షి సిన్హా, జ్యోతిక వంటి ఇద్దరు పవర్‌హౌస్ పెర్ఫార్మర్స్ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరితో పాటు వెటరన్ యాక్టర్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ లీగల్ థ్రిల్లర్ డ్రామాను అశ్విని అయ్యర్ తివారీ తనదైన శైలిలో ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. న్యాయవ్యవస్థలోని లోతుపాతులను స్పృశిస్తూనే, సామాన్యులకు అది ఎంతవరకు చేరువ అవుతుందనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.

ప్రపంచవ్యాప్త విడుదల ఎప్పుడంటే?

'సిస్టమ్' మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. మే 22, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240కి పైగా దేశాల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. లీగల్ డ్రామాలు, కోర్టు రూమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు 'సిస్టమ్' ఒక మంచి అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'సిస్టమ్' సినిమా ఏ ఓటీటీలో విడుదలవుతోంది?

ఈ సినిమా మే 22, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలవుతోంది.

సిస్టమ్ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఎవరు?

సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'సిస్టమ్' సినిమా ఏ జోనర్‌కు చెందుతుంది?

ఇది ఒక ఇంటెన్స్ లీగల్ డ్రామా, థ్రిల్లర్ మూవీ.

ఈ సిస్టమ్ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు?

ప్రముఖ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ సినిమాను రూపొందించారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu