Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో!

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో!

Project Hail Mary OTT Trending: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ వెతుకుతుంటారు. తెలుగు చలనచిత్ర అభిమానులకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఎప్పుడూ ఎంతో క్రేజ్ ఉంటుంది.

విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్

గతంలో వచ్చిన 'ఇంటర్‌స్టెల్లార్', 'ది మార్షియన్' లాంటి అంతరిక్ష నేపథ్య చిత్రాలను మనవాళ్లు థియేటర్లలోనూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మరో విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఆ సినిమానే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (Project Hail Mary). ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం మన దేశంలోనే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమా దాదాపు రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓటీటీ స్క్రీన్‌పై హవా

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 683 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ. 5700 కోట్లు) వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వెండితెరపై అదరగొట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా, ఇప్పుడు ఓటీటీ స్క్రీన్‌పై కూడా అదే స్థాయి హవా కొనసాగిస్తోంది.

ఇటీవల జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం వంటి అనేక భాషల్లో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దుమ్ములేపుతోంది ఈ సినిమా.

టాప్ 5లో ఓటీటీ ట్రెండింగ్

ప్రస్తుతం ఇవాళ్టీకి (జూలై 6) అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 5వ స్థానంలో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ టాప్ 10 జాబితాలో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ 5వ స్థానంలో దూసుకుపోవడం విశేషం.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్యుడు నాశనం అవడం మొదలు కావడంతో ఇతర గ్రహాలతోపాటు భూమికి ప్రమాదం ఏర్పడుతుంది. దాని నుంచి కాపాడేందుకు స్పేస్‌లోకి ఓ సాధారణ సైన్స్ టీచర్‌ను పంపిస్తారు సైంటిస్టులు. ఆ తర్వాత ఏమైందనేదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమా కథ.

స్పేస్‌లో ఒంటరి పోరాటం.. జ్ఞాపకాలు లేని టీచర్

సినిమాను వివరంగా చూస్తే.. ఒక పాఠశాలలో పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్పే ఒక టీచర్ (ర్యాన్ గోస్లింగ్) హఠాత్తుగా ఒక అంతరిక్ష నౌకలో (Space Ship) కళ్లు తెరుస్తాడు. తీరా చూస్తే అతనికి తన గతం ఏదీ గుర్తుండదు. తానెవరు, అక్కడికి ఎలా వచ్చాడు, అసలు తన మిషన్ ఏంటి అనే విషయాలు పూర్తిగా మర్చిపోతాడు.

తనతో పాటు ఆ స్పేస్‌షిప్‌లో ఉన్న మిగతా వ్యోమగాములంతా అప్పటికే చనిపోయి ఉంటారు. అలాంటి విపత్కర పరిస్థితిలో, శూన్యంలో చిక్కుకుపోయిన ఆ టీచర్ అక్కడి నుంచి సురక్షితంగా భూమికి ఎలా తిరిగి చేరాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

పరాయి గ్రహం స్నేహితుడితో ఎమోషనల్ జర్నీ

అంతరిక్షంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ సైన్స్ టీచర్‌కు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. వేరే గ్రహానికి చెందిన ఒక వింత ప్రాణి అతనికి స్నేహితుడిగా మారుతుంది. ఆ పరాయి గ్రహం మిత్రుడు మన హీరోను తిరిగి తన ఇంటికి పంపించడానికి రకరకాలుగా సహాయం చేస్తాడు.

ఓటీటీ ట్రెండింగ్‌లో

విభిన్న గ్రహాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య సాగే స్నేహం, వారి మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాను ఎంజాయ్ చేయాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీపై ఓ లుక్కేయవచ్చు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu