Pawan Kalyan On Modi: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ వేదికగా ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ స్పీచ్
ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు. ఇటీవల జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ప్రస్తావిస్తూ.. మోదీని మాటలు అంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని పవన్ పేర్కొన్నారు.
సెలవు లేకుండా
''ప్రధాన మంత్రిని చాలా మంది అనకూడని మాటలు అంటుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం కష్టపడేవాళ్లకు ఇదా చివరకు మనం ఇచ్చేది? ఆయన పడ్డ కష్టం ఎవరికి తెలుసు? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. మన దేశ అభివృద్ధి కోసం బయట శత్రువులతో, లోపలి శత్రువులతో పోరాడుతున్నారు'' అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
పిల్లలను సరైన దారిలో
''మేం ఉన్నాం మీ వెంట. మీ మీద మాట పడితే మా మీద పడ్డట్లే అని ప్రధాని వెంటే ఉండాలి. జంతర్ మంతర్ దగ్గర ఆయన్ని ఎన్నో మాటలు అన్నారు. కానీ నేను చెప్తున్నా మోదీని కొట్టే నాయకుడు ఈ భారతదేశంలో లేరు. పిల్లలను సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారం నేర్పించడం చాలా చాలా అవసరం. ఈ రోజు పొద్దున ప్రధానమంత్రి స్టేట్మెంట్ చూశా. తనను దూషించిన వాళ్లను కూడా క్షమించారు'' అని పవన్ చెప్పారు.
రామకార్యం
''దేశాన్ని నడిపించడం రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. రామకార్యం చాలా గొప్పది. ఇప్పుడు ప్రధాని అలాంటి కార్యమే చేస్తున్నారు. మనం హనుమంతుడిలా వెంట నడవాలి'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కంగనా కూడా
ఇటీవల నటి, బీజేపీ ఎంపీ కంగనా రాణావత్ (Kangana Ranaut) కూడా ప్రధాని మోదీని ఉద్దేశించి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో మిలియన్ల మంది ప్రజలు మోదీని ఒక నాయకుడిగానే కాకుండా కుటుంబ సభ్యుడిగా, దేవుడిగా భావిస్తారని, అలాంటి వారి భావోద్వేగాలను గాయపరచడం సరికాదని ఆమె పేర్కొనడం గమనార్హం.
జంతర్ మంతర్ నిరసనలు
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సిజెపి (CJP) ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీతో పాటు ఆయన దివంగత మాతృమూర్తిపై అత్యంత అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేశారనే వివాదం చెలరేగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జులై 25న ఈ నిరసనలు ముగిసినప్పటికీ, ఆందోళనకారుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Chandu Shanigarapu

