Dailyhunt
Phone addiction : స్మార్ట్​ఫోన్ వ్యసనానికి అసలు కారణం ఏంటి? విముక్తి మార్గం ఏది?

Phone addiction : స్మార్ట్​ఫోన్ వ్యసనానికి అసలు కారణం ఏంటి? విముక్తి మార్గం ఏది?

How to Reduce Screen Time : ప్రస్తుత కాలంలో ఫోన్ చూడకుండా ఉండలేకపోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. అది ఒక తీవ్రమైన వ్యసనంగా మారుతోంది.

ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఈ 'స్క్రోలింగ్' చక్రంలో చిక్కుకుపోయారంటే మీరు నమ్మగలరా? మరి ఈ అడిక్షన్ నుంచి బయటపడం ఎలా? థెరపిస్ట్ నాడియా అద్దెసి ఈ సమస్యపై లోతైన విశ్లేషణను అందించారు.

ఫోన్ వ్యసనం అంటే ఏంటి?

మనం ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, మన మెదడు దానికి పరిష్కారంగా స్మార్ట్​ఫోన్‌ను ఎంచుకుంటుందట! ఒత్తిడి, విసుగు లేదా ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఫోన్ ఒక వేగవంతమైన మార్గంగా మారుతుంది. ఫోన్ చూసినప్పుడు మనకు లభించే 'రిలీఫ్' కారణంగా మెదడు దానిపై పూర్తిగా ఆధారపడటం మొదలుపెడుతుంది. చివరికి ఇది ఎంతగా ముదురుతుందంటే.. మనకు తెలియకుండానే యాంత్రికంగా ఫోన్ కోసం చేతులు వెళుతుంటాయి.

ఇది సమస్యాత్మకమని గుర్తించడం ఎలా?

మీరు కింది పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మీరు స్మార్ట్​ఫోన్ అడిక్షన్​కి గురైనట్లే!

  • ఒక పని చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ ఓపెన్ చేసి, అసలు ఏం చేస్తున్నారో మర్చిపోవడం.
  • మానసిక ఒత్తిడి లేదా విసుగు కలిగినప్పుడు నిరంతరం స్క్రోల్ చేయడం.
  • ఉదయం నిద్ర లేవకముందే బెడ్ మీద ఫోన్ చెక్ చేయడం.
  • ఉపయోగించకపోయినా ఫోన్‌ను గది గదికీ వెంట తీసుకెళ్లడం.
  • ఖాళీ సమయం దొరికితే చాలు, ఏం లేకపోయినా ఫోన్ చూడటం.
  • ఇతరులతో సంభాషణల్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ తీయడం.
  • ఫోన్ పక్కన లేకపోతే విపరీతమైన ఆందోళన చెందడం.

దీనిని ఆపడం ఎందుకు కష్టం?

మన మెదడు ఎప్పుడూ అసౌకర్యం నుంచి త్వరగా బయటపడాలని చూస్తుంది. ఫోన్ కేవలం సెకన్లలోనే మనకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే మెదడు ఈ 'షార్ట్‌కట్'ను అలవాటు చేసుకుంటుంది:

విసుగు: మెదడు ఉద్దీపనను కోరుకుంటుంది → ఫోన్ ఓపెన్ చేస్తాం → డోపమైన్ విడుదలవుతుంది.

ఆందోళన: తప్పించుకోవాలని చూస్తాం → స్క్రోల్ చేస్తాం → మొద్దుబారిపోతాం.

ఒంటరితనం: గుర్తింపు కోరుకుంటాం → నోటిఫికేషన్లు చూస్తాం → తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది.

అలసట: విశ్రాంతి కోరుకుంటాం → స్క్రోల్ చేస్తాం → తక్షణ శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.

ఇది ఏ వ్యసనానికైనా వర్తించే సైకిల్​! ఇప్పుడు ఉపశమనం.. తర్వాత నష్టం.

దీని వల్ల మెదడు, శరీరానికి జరిగే నష్టం..

అతిగా ఫోన్ వాడటం వల్ల మన శరీరంలో కొలవదగ్గ నష్టం జరుగుతుంది:

మెదడు మందగించడం: రోజుకు ఒక గంట అదనంగా ఫోన్ వాడినా మీ ఆలోచనా వేగం తగ్గుతుంది.

ఏకాగ్రత కోల్పోవడం: భావోద్వేగాలను నియంత్రించే, ఏకాగ్రతను పెంచే మెదడులోని భాగాలు కుంచించుకుపోతాయి.

జ్ఞాపకశక్తి: స్వల్పకాలిక జ్ఞాపకశక్తి బలహీనపడి, చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటాం.

విశ్రాంతి లేకపోవడం: మెదడు ఎప్పుడూ 'ఆన్' మోడ్‌లోనే ఉంటుంది, దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు.

శారీరక నొప్పులు: మెడ నొప్పి, తలనొప్పి, కంటి అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.

బంధాలు, వ్యక్తిత్వంపై ప్రభావం..

దూరం పెరగడం: ఫోన్ కనిపిస్తుంటే ఎదుటి వ్యక్తులు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తారు.

సానుభూతి తగ్గడం: ఏకాగ్రత దెబ్బతినడం వల్ల ఇతరుల భావాలను అర్థం చేసుకునే శక్తి తగ్గుతుంది.

ఆత్మవిశ్వాసం దెబ్బతినడం: సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల అశాంతి, అసూయ పెరుగుతాయి.

నోమోఫోబియా: ఫోన్ పక్కన లేకపోతే విపరీతమైన ఒత్తిడికి గురవ్వడం.

ఈ వ్యసనం నుంచి బయటపడటం ఎలా?

ఫోన్ మీ దగ్గరగా ఉంటే మెదడు దాన్ని త్వరగా అందుకుంటుంది. కాబట్టి దూరాన్ని పెంచండి:

  • పని చేసేటప్పుడు ఫోన్‌ను వేరే గదిలో ఉంచండి.
  • భోజనం చేసేటప్పుడు డ్రాయర్‌లో పెట్టండి.
  • నడుస్తున్నప్పుడు జేబులోనే ఉంచండి.
  • ఇతరులతో ఉన్నప్పుడు ఫోన్ కనిపించకుండా చూడండి.

ఇతర చిట్కాలు:

ఉదయపు అలవాటు: నిద్ర లేవగానే మెదడు మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో స్క్రోలింగ్‌కు బదులు శ్వాస వ్యాయామం లేదా నడక వంటివి చేయండి.

యాప్స్ సెట్టింగ్స్: ఎక్కువగా వాడే యాప్స్ చివరి పేజీకి మార్చండి. ఫోన్‌ను 'గ్రేస్కేల్' మోడ్‌లో ఉంచండి.

లాగ్ అవుట్: ప్రతిరోజూ యాప్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి, తద్వారా ప్రతిసారీ పాస్‌వర్డ్ టైప్ చేయడం మీకు విసుగు తెప్పిస్తుంది.

వాచ్ వాడండి: కేవలం సమయం చూడటానికి ఫోన్ తీయకుండా ఉండేందుకు వాచ్ ధరించండి.

14 రోజుల రీసెట్ సిస్టమ్..

మీరు పూర్తిగా ఫోన్‌ను వదిలేయాల్సిన అవసరం లేదు. కేవలం 14 రోజుల పాటు కింది నియమాలు పాటించండి:

  • సోషల్ మీడియాను రోజుకు కేవలం 30 నిమిషాలకు పరిమితం చేయండి.
  • మీ మూడ్, నిద్ర, ఏకాగ్రత ఎలా ఉన్నాయో ఒక దగ్గర రాసుకోండి.
  • 14వ రోజున మీ శక్తిని మొదటి రోజుతో పోల్చి చూసుకోండి.

ఈ మార్పులు మీ జీవిత సంతృప్తిని, ఏకాగ్రతను అద్భుతంగా మెరుగుపరుస్తాయి.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu