దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల శక్తి, సంకల్పం, అసాధారణ విజయాలను సత్కరించేందుకు భారత ప్రభుత్వం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్'2026కు నామినేషన్లను ఆహ్వానించింది.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రదానం చేసే ఈ పురస్కారాలు విజ్ఞానశాస్త్రం, కళలు, క్రీడలు, సంగీతం, నృత్యం, సాహసం, సామాజిక సేవ వంటి రంగాలలో పిల్లలు చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తాయి.
జూలై 31, 2026 నాటికి 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, భారతదేశంలో నివసిస్తున్న పిల్లలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. వీటిని జూలై 31, 2026 లోపు https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. స్వయంగా చేసుకునే నామినేషన్లను (Self-nominations) కూడా స్వీకరిస్తారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పాటు చేసిన PMRBP కమిటీ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ పురస్కారాలను డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' సందర్భంగా ప్రకటించి, న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు.
దరఖాస్తు చేసే సమయానికి (జూలై 31 నాటికి) 5 నుండి 18 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. భారతీయ పౌరుడై ఉండాలి, భారతదేశంలోనే నివసిస్తూ ఉండాలి.
ఎంపికైన ప్రతి విజేతకు ఒక మెడల్ (పతకం), రూ. 1,00,000 (లక్ష రూపాయల) నగదు బహుమతి, ప్రశంసా పత్రం, గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
ఆసక్తి కలిగిన వారు 2026 జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా పౌరుడు అర్హులైన పిల్లలను నామినేట్ చేయవచ్చు, లేదంటే పిల్లలు స్వయంగా తమ పేర్లను నామినేట్ (Self-nomination) చేసుకోవచ్చు.
Anand Sai

