Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం నామినేషన్లు.. పూర్తి వివరాలు!

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం నామినేషన్లు.. పూర్తి వివరాలు!

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)-2026 కోసం ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి విద్యా సంస్థలు, సంఘాలు, ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) కోరింది.

ఒక ప్రకటనలో APSCHE ఛైర్మన్ కె.మధు మూర్తి మాట్లాడారు. చాలా మంది అర్హులైన పిల్లల గురించి బయటకు రావడం లేదన్నారు. దీంతో వారిని తరచుగా గుర్తించబడకుండా పోతున్నారని, అటువంటి విజేతలను ప్రోత్సహించి, జాతీయ గుర్తింపు కోసం నామినేట్ చేయాలని అన్నారు.

PMRBP-2026 కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్(awards.gov.in) ద్వారా ఆన్‌లైన్ నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు జూలై 31, 2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అర్హులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను ఇది గుర్తిస్తుంది.

ఈ అవార్డులను ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలలో ప్రదానం చేస్తారు. ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 1, 2026న ప్రారంభం కాగా, దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31, 2026గా నిర్ణయించారు.

ఈ అవార్డుల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయాలని, అలాగే జాతీయ గుర్తింపునకు అర్హమైన విజయాలు సాధించిన ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, రాష్ట్ర విద్యా బోర్డులు, ఇతర సంస్థలకు ఏపీ ఉన్నత విద్యామండలి విజ్ఞప్తి చేసింది. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలు వారి విజయాలు, సేవలకు గుర్తింపు పొందేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని కౌన్సిల్ తెలిపింది.

ఎంపికైన ప్రతి విజేతకు ఒక మెడల్ (పతకం), రూ. 1,00,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం, గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

ఆసక్తి కలిగిన వారు 2026 జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా పౌరుడు అర్హులైన పిల్లలను నామినేట్ చేయవచ్చు, లేదంటే పిల్లలు స్వయంగా తమ పేర్లను నామినేట్ చేసుకోవచ్చు.

Anand Sai, Amaravati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu