Pregnancy Risks : కొడుకు కావాలంటూ.. కుటుంబ సభ్యులు పెడుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా రాజస్థాన్‌కు చెందిన ఒక 22 ఏళ్ల యువతి ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆరోసారి గర్భం దాల్చింది1 బరౌత్‌లోని స్పందన్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా తోమర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.
ఆ యువతికి మైకము రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. "కొడుకు కావాలనే కోరికతో ఒకరి ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, వరుస గర్భధారణల వల్ల మహిళల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుర్గావ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అంజలి కుమార్ వివరణ ప్రకారం.. ఒక కాన్పు తర్వాత మహిళ శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి పొందేందుకు, కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వకుండా వెంటనే మళ్లీ గర్భం దాల్చడం వల్ల తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.
వరుస గర్భధారణల వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇక్కడ తెలుసుకోండి..
1. తల్లి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు..
సాధారణ ప్రెగ్నెన్సీతో పోలిస్తే, తగినంత గ్యాప్ లేకుండా వరుసగా గర్భం దాల్చే మహిళల్లో ఈ కింది సమస్యలు రెండు రెట్లు ఎక్కువగా పెరుగుతాయి:
తీవ్రమైన రక్తహీనత : ప్రతి ప్రెగ్నెన్సీలోనూ తల్లి శరీరం నుంచి పోషకాలు బిడ్డకు వెళతాయి. తగినంత విరామం లేకపోతే తల్లి శరీరంలో రక్తం, ఐరన్, ఇతర పోషకాల నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయి.
బీపీ, డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చే హైపర్ టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్, తీవ్రమైన దీర్ఘకాలిక అలసట బారిన పడతారు.
గర్భాశయం చిరిగిపోవడం (యుటేరిన్ రప్చర్) : వరుస ప్రెగ్నెన్సీల వల్ల గర్భాశయం బలహీనపడి, కాన్పు సమయంలో అది చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది తల్లి ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
బిడ్డపై ప్రభావం: ఇలాంటి తల్లులకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండకుండానే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం..
చిన్న వయసులోనే ఒకరి తర్వాత ఒకరు చొప్పున వరుసగా చాలా మంది పిల్లలను కనడం వల్ల.. వారిని చూసుకోవడం శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మహిళల్లో తీవ్రమైన యాంగ్జైటీ, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (కాన్పు తర్వాత వచ్చే తీవ్రమైన నిరాశ)కు దారితీస్తుంది.
రెండు కాన్పుల మధ్య సరైన గ్యాప్ ఎంత ఉండాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం: ఒక బిడ్డ పుట్టిన తర్వాత, తదుపరి గర్భధారణకు కనీసం 24 నెలల (2 సంవత్సరాలు) సమయం ఉండాలని సిఫార్సు చేస్తోంది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ట్సెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం.. ఒక కాన్పుకు, తదుపరి గర్భధారణకు మధ్య కనీసం 18 నెలల విరామం తప్పనిసరి.
పెద్ద బిడ్డకు కనీసం రెండేళ్లు వచ్చే వరకు ఆగడం వల్ల తల్లి శారీరక బలాన్ని పుంజుకుంటుంది, పిల్లల ఎదుగుదలకు తగిన సమయం దొరుకుతుంది.
3. ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కువ గర్భాలు ప్రమాదకరం?
డాక్టర్ అంజలి కుమార్ ప్రకారం.. ఈ కింది సమస్యలు ఉన్న మహిళలు ఎక్కువ సార్లు గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం:
మధుమేహం, బీపీ, ఊబకాయం, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు.
35 ఏళ్లు దాటిన మహిళలు లేదా ఇప్పటికే 5 సార్లు కాన్పులు అయిన వారు మళ్లీ గర్భం దాల్చితే గర్భస్రావం, బిడ్డలో జన్యుపరమైన లోపాలు, ప్రీ-ఎక్లాంప్సియా వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ముప్పు చాలా ఎక్కువ.
4. సిజేరియన్ ఐతే మరింత డేంజర్!
సాధారణ కాన్పుతో పోలిస్తే, సిజేరియన్ అయిన మహిళల్లో వరుస ప్రెగ్నెన్సీలు అత్యంత ప్రమాదకరమైనవి.
4 లేదా 5 సార్లు సిజేరియన్లు జరిగితే ప్లాసెంటా ప్రివియా, ప్లాసెంటా అక్రిటా, గర్భాశయం బద్దలయ్యే అవకాశాలు పెరుగుతాయి.
మూడు కంటే ఎక్కువ సిజేరియన్లు జరిగిన మహిళల్లో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పులు, అంతర్గత అవయవాలు ఒకదానికొకటి అతుక్కుపోవడం జరుగుతుంది. కాబట్టి సిజేరియన్ అయిన వారు తదుపరి ప్రెగ్నెన్సీ కోసం కనీసం 18 నుంచి 24 నెలలు ఖచ్చితంగా ఆగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ పాటించడం, రెండు కాన్పుల మధ్య సరైన గ్యాప్ ఉంచడం అనేది కేవలం తల్లి ఆరోగ్యాన్నే కాకుండా, పుట్టబోయే పిల్లల భవిష్యత్తును, కుటుంబ సంక్షేమాన్ని కాపాడుతుందని వైద్య లోకం స్పష్టం చేస్తోంది.
Chitturi Eswara Karthikeya Sharath

