గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన తెలుగు అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'వారణాసి' షూటింగ్ నిమిత్తం ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.
షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దొరికిన విరామాన్ని ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీతో కలిసి ఎంతో హాయిగా గడిపారు.
బికినీ షూట్.. మామిడి కాయ ముక్కలు!
సోమవారం (ఏప్రిల్ 6) నాడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ 'సండే ఫన్'కు సంబంధించిన ఫోటోలను ప్రియాంకజ చోప్రా అభిమానులతో పంచుకున్నారు. వారణాసి హీరోయిన్ షేర్ చేసిన ఫోటోల్లో ప్రియాంక చోప్రా పూల్ సైడ్ రిలాక్స్ అవుతూ కనిపించారు.
"చాలా కాలం తర్వాత ఒక ఆదివారం నిజంగా ఆదివారాలా అనిపించింది" అంటూ ప్రియాంక చోప్రా క్యాప్షన్ ఇచ్చారు. ఒక ఫోటోలో నీలిరంగు బికినీలో ప్రియాంక చోప్రా పోజులివ్వగా, మరో వీడియోలో పచ్చి మామిడి కాయ ముక్కలపై కారం చల్లుకుని తింటూ తనలోని 'దేశీ' గర్ల్‌ను గుర్తుచేశారు.
మగాడిలా ప్రవర్తించు
ఇది చూసిన అభిమానులు "పీసీ తన దేశీ స్నాక్స్‌ను అస్సలు వదలదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సైతం ప్రియాంక ఫోటోలపై స్పందిస్తూ "నిజమైన సూపర్ స్టార్" అని ప్రశంసించారు.
కుటుంబ సభ్యులతో ఉన్న ఇతర ఫోటోల్లో మాల్టీ మేరీ తన నానమ్మ మధు చోప్రాతో ముచ్చటగా కనిపిస్తుండగా, అమెరికాలో ఉన్న నిక్ జోనాస్‌కు వీడియో కాల్ చేసి మాల్టీ పలకరించడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. షూటింగ్ సెట్‌లో 'మగాడిలా ప్రవర్తించు' (Behave like a man) అని రాసి ఉన్న చాక్ బోర్డ్ వీడియో కూడా ఇందులో ఉండటంతో వారణాసి సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
రాజమౌళి 'వారణాసి' విశేషాలు
'RRR' వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'. 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర'గా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
అలాగే, మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రను పోషిస్తున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సాగే సాహసగాథగా వారణాసి సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
ఓటీటీ సినిమాలు, సిరీసులు
2016లో వచ్చిన 'జై గంగాజల్' తర్వాత ప్రియాంక చోప్రా నేరుగా భారతీయ వెండితెరపై కనిపిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే హాలీవుడ్‌లో 'ది బ్లఫ్', 'సిటాడెల్ సీజన్ 2' వంటి భారీ ఓటీటీ సినిమాలు, సిరీసులతో అలరించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు రాజమౌళి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

