Priyanka Chopra About Katrina Kaif And Raju Khan: నేషనల్ అవార్డు విన్నర్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంటే మనకు గుర్తొచ్చేది ఆమె అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు.
కానీ, తన కెరీర్ ఆరంభంలో ఆమె డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. 'వోగ్ అరేబియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
ఒకేసారి చేయడం నా వల్ల అయ్యేది కాదు
"సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చాలా దారుణంగా డ్యాన్స్ చేసేదాన్ని. ఒకవైపు నటన, మరోవైపు కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్.. ఇవన్నీ ఒకేసారి చేయడం నావల్ల అయ్యేది కాదు" అని ప్రియాంక చోప్రా నిజాయితీగా ఒప్పుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.
మైక్ కింద పడేసి వెళ్లారు
"నువ్వు ఏదో అందాల పోటీల (Miss World) నుంచి వచ్చుండొచ్చు.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో" అంటూ మైక్ కింద పడేసి సెట్ నుంచి వెళ్లిపోయారట ఆ కొరియోగ్రాఫర్. ఆ సమయంలో తాను ఎంతో సిగ్గుపడ్డానని, బాధగా అనిపించిందని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పట్టుదలతో శ్రమించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత 'దేశీ గర్ల్', 'రామ్ చాహే లీలా' వంటి సాంగ్స్‌తో అందరినీ మెప్పించారు.
కత్రినా కైఫ్ సాయంతో కఠిన సాధన
ప్రస్తుతం రాజు ఖాన్, ప్రియాంక మంచి స్నేహితులు కావడం విశేషం. డ్యాన్స్‌లో తన బలహీనతను అధిగమించడానికి ప్రియాంక చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆమెకు తోడయ్యారు. అప్పటికే కత్రినా మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో, ఆమె దగ్గర మెళకువలు నేర్చుకుంటూ రోజుకు ఆరు గంటల పాటు ప్రియాంక ప్రాక్టీస్ చేసేవారట. అలా తనను తాను మలచుకుని బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగారు ప్రియాంక చోప్రా.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన ఓటీటీ మూవీ 'ది బ్లఫ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే భారతీయ ప్రేక్షకులు మాత్రం ఆమె 'వారణాసి' సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి సినిమాతో ఇండియాకు రీ-ఎంట్రీ
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్‌లో ప్రియాంక చోప్రా మందాకినీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

