మనం రోజంతా కష్టపడి పనిచేసేది సుఖంగా ఉండటానికే. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు లేదా మనశ్శాంతి కరువవ్వడం వంటివి జరుగుతుంటాయి.
దీనికి కారణం మనకు తెలియకుండానే రాత్రి వేళల్లో మనం చేసే కొన్ని వాస్తు విరుద్ధమైన పనులు కూడా కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి సమయం అనేది విశ్రాంతికి మాత్రమే కాదు, ఇంట్లోని శక్తిని సమతుల్యం చేసే సమయం కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు రాత్రిపూట చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..
అపరిశుభ్రమైన వంటగది
చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలను అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అపరిశుభ్రమైన వంటగది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఎంగిలి పాత్రలను రాత్రంతా అలాగే ఉంచడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వస్తుందని అంటారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని పెద్దలు చెబుతారు. పడుకునే ముందే వంటగదిని క్లీన్ చేసుకోవడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
నగదు, బంగారం
రాత్రి పూట నగదును లేదా విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం లేదా అప్పుగా ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇది మీ ఇంటి నుంచి సంపద బయటకు వెళ్ళిపోవడానికి సంకేతంగా భావిస్తారు. అలాగే మీ లాకర్ లేదా అల్మారా ఎప్పుడూ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి.
జుట్టు కత్తిరించడం లేదా గోర్లు తీయడం
సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇల్లు ఊడ్చడం కూడా మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరై ఊడ్చినా, ఆ చెత్తను రాత్రిపూట బయట పారవేయకూడదు.
తల వద్ద పెట్టకూడని వస్తువులు
నిద్రపోయేటప్పుడు తల పక్కన నీళ్ల గ్లాసు, మొబైల్ ఫోన్లు, పుస్తకాలు లేదా పాత వార్తాపత్రికలు ఉంచుకోకూడదు. ఇవి మీ ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. రాహు-కేతువుల ప్రభావం పెరిగేలా చేస్తాయి. పడకగదిలో తల వైపున నీరు ఉంచడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుందని వాస్తు చెబుతోంది.
ఉప్పు, పాలు ఇవ్వడం
చీకటి పడిన తర్వాత పొరుగువారికి ఉప్పు, పాలు లేదా పెరుగు వంటివాటిని అప్పుగా ఇవ్వకూడదు. పాలు చంద్రునికి ప్రతీక, ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. వీటిని రాత్రి వేళ ఇతరులకు ఇవ్వడం వల్ల మీ ఇంటి అదృష్టం తగ్గుతుందని నమ్ముతారు.
వాస్తు అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు. అది మన జీవనశైలిని క్రమబద్ధం చేసే ఒక మార్గం. పైన చెప్పిన చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొనడమే కాకుండా, ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
Anand Sai

